గుండెలు గుబేల్ : అంతరిక్షం నుంచి తుఫాన్ బిపార్జోయ్

గుండెలు గుబేల్ : అంతరిక్షం నుంచి తుఫాన్ బిపార్జోయ్

బిపార్జోయ్ తుపాను కోసం భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో.. గురువారం గుజరాత్‌పై ల్యాండ్‌ఫాల్ చేసే అవకాశం ఉన్నందున , వ్యోమగామి సుల్తాన్ అల్నియాడి అంతరిక్షం నుంచి తుఫానుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేసిన వ్యోమగామి.. అరేబియా సముద్రంలో తుపాను అంచుని చూపించే దృశ్యాలను షేర్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రెండు రోజుల పాటు ఈ చిత్రాలు తీసినట్టుగా తెలుస్తోంది.

గురువారం సాయంత్రం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో బిపార్జోయ్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జూన్ 6, 2023న అరేబియా సముద్రంలో తీవ్ర తుపానుగా మారింది. గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది. రానున్న కాలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) గుజరాత్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కచ్ ప్రాంతంలో అధిక గాలులు వినాశనం సృష్టిస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా తుపాను తీవ్రత గంటకు 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.