ఏపీ, తమిళనాడులో వర్ష బీభత్సం

ఏపీ, తమిళనాడులో వర్ష బీభత్సం

ఏపీపై మాండౌస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాయలసీమ అంతటా జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరులో పలు కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని నదులు, వాగులు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయలసీమతో పాటు తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 

మహబలిపురం దగ్గర తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్తున్నాయి. నిన్న చెన్నై, తాంబరం, గుడువాంజేరి, ఆవడితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లపై నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇవాళ, రేపు లక్షదీవులు, కేరళ, కర్నాటక కోస్తా తీర ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రంలో గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 12 గంటల్లో తుపాన్ బలహీనపడే అవకాశం ఉందన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని రాయలసీమకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. 

మరోవైపు మాండౌస్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే, మరో తుఫాన్ ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో రేపు ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి ఈ నెల 16న తుఫాన్ గా మారే అవకాశం ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో 16వ తేదీ వరకు వానలు పడ్తాయన్నారు అధికారులు.