నల్గొండ, సూర్యాపేట జిల్లాలో దంచి కొట్టిన వాన

నల్గొండ, సూర్యాపేట జిల్లాలో దంచి కొట్టిన వాన
  • అకాల వర్షాలకు నేలకొరిగిన వరి, భారీగా నష్టపోయిన పత్తి రైతులు 
  • వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు గ్రామాల రాకపోకలకు అంతరాయం
  • ప్రాజెక్టుల్లోకి భారీగా వరద 

నల్గొండ, వెలుగు:  నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం ఏర్పడింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలను భారీ వర్షాలు, ఈదురు గాలులు ముంచెత్తాయి.రాకపోకలు బంద్శాలిగౌరారం మండలం ఊట్కూరు -శాలి గౌరారం ప్రధాన రహదారిలో రోడ్డుపై భారీగా నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలగిరి సాగర్ మండలంలోని రంగుల వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో  తిరుమలగిరి నుంచి రాజవరం బోయగూడం, డొక్కల బావి రంగుల తండా  గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 దేవరకొండ మండలం తాటికొల్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో దేవరకొండ నుంచితాటికొల్‌కి రాకపోకలు నిలిచిపోయాయి. కొండమల్లేపల్లి మండలం కోల్ ముంతల్  పహాడ్ గ్రామం నుంచి మంత్రి తండా, రాముని గుండ్ల తండాకు వెళ్లే రోడ్డు మార్గం, కొండమల్లేపల్లి నుంచి చింతచెట్టు తండాకు వెళ్లే రహదారి, కొండమల్లేపల్లి నుంచి నల్గొండ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉధృతంగా రావడంతో రాకపోకలకు అధికారులు నిలిపివేశారు. 

చండూరు నాంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి వెళ్లే లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు ఆ మార్గం పై రాకపోకలు నిలిపివేశారు. సూర్యాపేట - దంతాలపల్లి రాకపోకలు నిలిచిపోయాయి. 

నీట మునిగిన గ్రామాలు 

వర్షాల కారణంగా పలు గ్రామాలు నీట మునిగాయి. దేవరకొండ మండలం పచ్చర్ల బావి, నల్లకుంట నిండి అలుగు పోయడంతో కొండమల్లేపల్లి మండల పరిధిలోని గౌరికుంట తండాలోకి నీరు రావడంతో పలు ఇండ్లు నీట మునిగాయి. కొండమల్లేపల్లి పట్టణంలోని వినాయక నగర్, భరత్ నగర్, నల్గొండ రోడ్లోని పలు వార్డులలో పలు ఇండ్లు జలమయమయ్యాయి. నల్గొండ జిల్లాలో చందంపేట మండలంలోని తేడ్లవారి పల్లి గ్రామంలో అత్యాదికాంగ 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 గుండ్లపల్లి మండలంలోని ఎర్రరంలో 138 మిల్లీమీటర్లు, చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో 122.5 మిల్లీమీటర్లు, చందంపేట 120.05 మిల్లీమీటర్లు, పెద్దవూర మండలంలోని పులిచర్ల గ్రామంలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 110.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా జాజిరెడ్డిగూడెం మండలంలో 94.5మిల్లీమీటర్లు, తిరుమలగిరి 92.03, నాగారం 92.01, మద్దిరాల మండలంలో 74.01 వర్షపాతం నమోదైంది.

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలో భారీగా వాన కురిసింది. బుధవారంతో పాటు గురువారం కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అడ్డగూడూరు, మోత్కూరులో 18 సెంటీమీటర్ల వాన కురిసింది. ఆత్మకూరు (ఎం)లో 17.9, ఆలేరులో 14.2, గుండాలలో 11.7 మోటకొండూరులో 10.6 సెంటీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ నమోదు చేసింది. 

ఉధృతంగా మూసీ 

ఎగువ హైదరాబాద్​లో కురుస్తున్న వాన కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగెం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. రుద్రవెళ్లి లోలెవల్​ బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది.  దీంతో మార్గం మూసి వేసి రాకపోకలు నిలిపివేశారు.  చౌటుప్పల్​ ఊర చెరువులోకి వరద నీరు చేరుతుండడంతో  నీరు టౌన్​లోకి రాకుండా కాలువలను జేసీబీలతో వెడల్పు చేశారు.  చెరువును కలెక్టర్​ హనుమంతరావు సందర్శించారు.