అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర మురసు తుపాను తీరం దాటింది. మంగళవారం (నవంబర్ 3) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరం దాటింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 100–110 కి.మీ.గా, గరిష్టంగా 120 కి.మీ. వేగంతో వీచింది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణాతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు పడుతున్నాయి.
ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల జిల్లాలో మురసు తుపాను బీభత్సం సృష్టించింది. కొత్తపట్నం, టంగుటూరు సహా 6 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఒంగోలులోనూ బలమైన ఈదురుగాలులు, వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులు, భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆర్టీజీఎస్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుపానును నిరంతరం పర్యవేక్షించింది. ఏవైనా సమస్యలు ఎదురైతే 9552300009కి మన మిత్ర ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు అధికారులు. తుపాను తీరం దాటినప్పటికి మంగళవారం (నవంబర్ 3) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. మురసు తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
