అమరావతి: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పులివెందుల మున్సిపాలిటీలో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. పులివెందులలో రీ పోలింగ్‌కు నిరాకరిస్తూ మంగళవారం (నవంబర్ 3) హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. మంగళవారం (నవంబర్ 3) ఉదయం 8 గంటలకు పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
అసలేం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 1న పులివెందుల మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 80 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 70 చోట్ల అధికార టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేశారని, వైసీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వైసీపీ ఆరోపించింది.
ఈ క్రమంలోనే పులివెందుల మున్సిపాలిటీలో రీ పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వైసీపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. పులివెందుల మున్సిపాలిటీలో రీ పోలింగ్‌కు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుతో పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌కు మార్గం సుగమమైంది.
