ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. ఆమె ముందున్న సవాళ్లు ఇవే

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. ఆమె ముందున్న సవాళ్లు ఇవే

బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మార్పులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని బీజేపీ అధిష్ఠానం నియమించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పోస్టు నుంచి తప్పుకోవాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించారు. జేపీ నడ్డా స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారని సమాచారం అందుతోంది.  అయితే ఏపీ బీజేపీ చీఫ్ పదవి రేసులో వై సత్యకుమార్, సుజనా చౌదరి పోటీలో ఉన్నారని ప్రచారం జరిగినా ... అధిష్ఠానం మాత్రం పురంధేశ్వరి వైపే  మొగ్గు చూపింది.

సోము అవుట్... పురంధేశ్వరి ఇన్..

పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగిస్తే  ఆమె సామాజికవర్గానికి చెందిన వారితోపాటు తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ నేతలను కూడా బీజేపీలోకి చేర్చుకొని పార్టీ బలోపేతానికి బాగా కృషిచేస్తారని అధినాయకత్వం భావించింది. సోమువీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ ఇసుమంత కూడా బలపడలేదని పార్టీ ఢిల్లీ పెద్దలు తెప్పించుకున్న నివేదికల ద్వారా కూడా వెల్లడైందని సమాచాచారం అందుతోంది. కనీసం పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా సోము రూపొందించలేకపోవడంతో ఆయన్ను తప్పించారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.  ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలకు పురంధేశ్వరి ఒక్కరే  ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించారు. 

పురంధేశ్వరి మార్పు తెస్తారా..?

ఏపీలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీ ఇంకా అలాగే జనసేన తర్వాత బీజేపీ ఇప్పుడు నాలుగోస్థానంలో ఉంది. కేంద్రంలో పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంటున్నా.. ఏపీలో మాత్రం ఉనికి కోసం పోరాటం చేస్తుంది బీజేపీ. ప్రతి ఎన్నికల్లో పొత్తులో ఉండటం వల్ల.. సొంత బలం అనేది లేకుండా పోయింది బీజేపీకి. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేయటం కోసం సోము వీర్రాజును బరిలోకి దించినా.. రెండేళ్లుగా మార్పు లేదని భావించింది బీజేపీ హైకమాండ్. దీంతో సోమును తొలగించి.. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన.. ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధేశ్వరిని కొత్త అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ అధిష్టానం.

ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైతే.. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కూడా బాగా ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీల్లో ఒకటి అయిన తెలుగుదేశం పార్టీకి.. తన మరిది అయిన చంద్రబాబు అధ్యక్షునిగా ఉన్నారు. సీఎం జగన్ మరో బలమైన సామాజికవర్గ నేతగా ఉన్నారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తో పొత్తు కూడా ఉంది. ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుందనే ప్రణాళికలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు ప్రస్తుత మార్పు కనిపిస్తుంది. 

ఇప్పడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకంతో.. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు వస్తాయి అనేది ఆసక్తితో మారింది. పవన్ కల్యాణ్ తో పొత్తుతో 2024 ఎన్నికలకు వెళతారా లేక టీడీపీతో కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. ఏపీ బీజేపీలో మార్పు తీసుకొస్తారా లేదా అనేది పురంధేశ్వరి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంది.