మూడ్రోజులుగా వెయ్యి లీటర్ల పాలు పారబోశాం.. విజయ డెయిరీ ముందు పాడి రైతుల ధర్నా

మూడ్రోజులుగా వెయ్యి లీటర్ల పాలు పారబోశాం.. విజయ డెయిరీ ముందు పాడి రైతుల ధర్నా

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లోని పాడి రైతులు సోమవారం చేర్యాలలోని విజయ డెయిరీ కేంద్రం ముందు పాల డబ్బాలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఏండ్లుగా విజయ డెయిరీకి పాలుపోస్తున్న తమను స్థానిక మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. వెన్న శాతం ఉండడం లేదని, ఎల్ఆర్ ​చూపించడం లేదని, రైతులు నీళ్లు, ఉప్పు కలుపుతున్నారనే ఆరోపణలతో పాలను వాపస్ ​పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా వెయ్యి లీటర్ల పాలను పారబోసినట్లు తెలిపారు.

పైగా తీసుకున్న పాలకు సరైన ధర చెల్లించడం లేదని, సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. డెయిరీ నుంచే లోన్లు తీసుకుని పాలను పోస్తున్న తమను నానా ఇబ్బందులు పెడుతున్నారని బాధపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి స్థానిక డెయిరీ మేనేజర్, సిద్దిపేట డిప్యూటీ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. రైతుల ధర్నాకు సీపీఎం, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకటమావో, అరుణ్​కుమార్, బీజేపీ నాయకులు శశిధర్​రెడ్డి, శివయ్య, పాడి రైతులు పాల్గొన్నారు. కాగా పాలల్లో ఉప్పు రావడంతోనే ధూల్మిట్టకు చెందిన పాలను రిజెక్ట్ చేశామని, ఉప్పు ఎందుకు ఉంటుందనే దానిపై టెస్టులు చేస్తున్నట్లు డెయిరీ మేనేజర్ మురళి వివరణ ఇచ్చారు.