శివ్వంపేట మండలంలో భూ సర్వేను అడ్డుకున్న దళిత రైతులు

శివ్వంపేట మండలంలో భూ సర్వేను అడ్డుకున్న దళిత రైతులు

శివ్వంపేట, వెలుగు: మండలంలోని చిన్న గొట్టిముక్కులలో గురువారం భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను దళిత రైతులు అడ్డుకున్నారు. మధిర అశోక్, అనిల్, కర్రె రాములు, సైదులు, భూషయ్య, చంద్రయ్య, భిక్షపతి,  పెంటయ్య, నర్సింలు, లింగం, గూడెం శ్రీను, నరసమ్మ  మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్  ప్రభుత్వం 292 సర్వే నంబర్ లోని 80 ఎకరాలను 25 మంది రైతులకు ఇచ్చిందన్నారు. అప్పటి నుంచి ఆ భూమి సాగు చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. 

తమ భూముల పక్కన భూమి కొనుగోలు చేసిన మాజీ ఎమ్మెల్యే రవీందర్​రెడ్డి తమ భూమిలో రెండు ఎకరాలు తనకు వస్తుందంటు పోలీసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉన్న తహసీల్దార్ కు ఫిర్యాదు చేస్తే ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా బెదిరించి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశారని, మాజీ ఎమ్మెల్యేతో పెట్టుకుంటే మీకు భూమి కూడా మిగలదని హెచ్చరించారన్నారు. ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. దళితుల జోలికొస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.