
- ఎంపీ వంశీకృష్ణను అవమానించారని దళిత సంఘాలు, కాంగ్రెస్ నేతల నిరసన
ధర్మారం, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్ల దేవాదాయ శాఖ వైఖరి అమానుషమని మాల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో శనివారం వారు నిరసన వ్యక్తం చేశారు. మాల సంఘం జిల్లా నాయకుడు బొడ్డు చంద్రమౌళి మాట్లాడుతూ.. దళితుడైన ఒక ఎంపీని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కనుసన్నల్లోనే ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణకు దేవాదాయ శాఖ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గోదావరిఖని: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్పాటించని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆఫీసర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. శనివారం గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. టీజంక్షన్వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లీడర్లు మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాల్లో అధికారికంగా ముద్రించిన ఫ్లెక్సీల్లో ఎంపీ ఫొటో లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రోటోకాల్ప్రకారం ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందించాలని డిమాండ్ చేశారు