
పెద్దపల్లి, వెలుగు: దళితుడైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత సామాజిక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన వంశీకృష్ణ పట్ల మొదటి నుంచి వివక్ష చూపుతున్నారన్నారని మండిపడ్డారు.
వారం కింద ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలకు ఎంపీకి ఆహ్వానం లేకపోగా, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ ఫొటో లేకపోవడం దారుణమన్నారు. దిశ కమిటీ మెంబర్ సయ్యద్ సజ్జాద్, దళిత సంఘాల లీడర్లు కైలాసం, చంద్రమౌళి, అమర జ్యోతి, లీడర్లు సతీశ్, ప్రశాంత్, సునీల్, రవి పాల్గొన్నారు.
అడిషనల్ డీసీపీకి ఫిర్యాదు
గోదావరిఖని, వెలుగు: సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫొటో లేకుండా అవమానానికి గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ లీడర్లు బుధవారం రామగుండం అడిషనల్డీసీపీ (అడ్మిన్) సి.రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు రాచకొండ కోటేశ్వర్లు, కామ విజయ్ మధు, అఖీమ్, అజయ్, మహేశ్, విజయ్, శ్రీను, రాజ్ కుమార్ పాల్గొన్నారు.