సర్పంచ్ అయినా కింద కూర్చోవాల్సిందే .. తమిళనాడులో కుల వివక్షత

సర్పంచ్ అయినా కింద కూర్చోవాల్సిందే .. తమిళనాడులో కుల వివక్షత

కుడ్డలూర్: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. దీనికి తమిళనాడులోని కుడ్డలూర్‌‌లో తాజాగా జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు. వివరాలు.. కుడ్డలూర్‌‌లోని తెర్కుతిట్టై గ్రామానికి రాజేశ్వరి అనే దళిత మహిళ సర్పంచ్‌‌‌. అయితే వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నడిచే పంచాయత్ బోర్డు మీటింగుల్లో దళిత మహిళ అయినందున రాజేశ్వరిని నేలపైనే కూర్చోవాలని ఆదేశిస్తున్నారట. దీంతో చేసేదేమి లేక ఆమె అలాగే కూర్చుంటోంది. ఈ ఏడాది జనవరిలో రాజేశ్వరి సర్పంచ్‌‌గా నియమితురాలైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని మీటింగుల్లోనూ కిందే కూర్చున్నానని రాజేశ్వరి వాపోయింది.

తెర్కుతిట్టై గ్రామంలో దాదాపుగా 500 కుటుంబాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అలాగే సుమారు 100 వరకు ఎస్సీ కమ్యూనిటీ చెందిన వారున్నారు. ఈ పంచాయతీని ఎస్సీ రిజర్వుడుగా ప్రకటించారు. రాజేశ్విరి గురించి విషయం తెలుసుకున్న పోలీసులు వైస్ ప్రెసిడెంట్ మోహన్ రాజ్‌‌పై హిందూ క్యాస్ట్, సెక్షన్ 3 (1) (ఆర్) కింద ఎస్సీ/ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. సదరు గ్రామ పంచాయతీ సెక్రటరీని ఉన్నతాధికారులు సస్సెండ్ చేశారు. ఈ ఘటనను పక్కనబెడితే రీసెంట్‌‌గా తిరువల్లూర్‌‌లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓ గ్రామ ప్రెసిడెంట్‌‌ను ఆ విలేజ్‌‌లోని మరొక కులస్థులు జెండా ఎగురవేయకుండా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.