మేడారాన్ని రెండో రాజధాని చేస్తం : విశారదన్ మహరాజ్

మేడారాన్ని రెండో రాజధాని చేస్తం : విశారదన్ మహరాజ్

ములుగు/వెంకటాపూర్(రామప్ప), వెలుగు : ప్రజలు తమను ఆశీర్వదించి అధికారం ఇస్తే ములుగు జిల్లాలోని మేడారంను రెండో రాజధాని చేస్తామని దళిత శక్తి ప్రోగ్రాం(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్​హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని 2 వేల ఎకరాల భూమిని డీ ఫారెస్ట్రేషన్ చేసి పేదలకు పంచుతామని చెప్పారు. డీఎస్పీ స్వరాజ్య పాదయాత్ర సోమవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంది. 10వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విశారదన్ మహరాజ్ బస్టాండ్ సమీపంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగంతోనే విముక్తి కలిగిందని, తమకు అధికారం ఇస్తే గిరిజన తెగలకు సమన్యాయం చేస్తామని చెప్పారు.

అగ్రకుల పాలకులు ములుగు జిల్లాలోని అటవీ సంపద, భూమిపై గిరిజన, గోండు, కోయ తెగలకు హక్కులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర ఇన్​చార్జ్​లక్ష్మణ్ మహరాజ్, డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, జిల్లా అధ్యక్షుడు సాంబశివన్, సురేశ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు భిక్షపతి గౌడ్, కోనేటి సంధ్య, సారంగపాణి, లింగమూర్తి, సదానందం, మోక్ష, కరుణాకర్ పాల్గొన్నారు. అంతకు ముందు డీఎస్పీ పాదయాత్ర వెంకటాపూర్ మండలంలోని కేశవాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో కొనసాగింది.