ధీరవనిత ఈశ్వరీబాయి

ధీరవనిత ఈశ్వరీబాయి

తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి కొద్దిమందిలో, నాలుగు దశాబ్దాల పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంతో కూడిన సమసమాజ స్థాపనే ధ్యేయంగా.. తెలుగు నేలపై బలమైన తిరుగుబాటు బావుటా ఎగరేసిన దళిత జాతి అగ్గిరవ్వ, ఉక్కు మహిళ జెట్టి ఈశ్వరీబాయి ఒకరు.

ఆమె 1918 డిసెంబర్​1న రాములమ్మ, బలరామస్వామి దంపతులకు సికింద్రాబాద్ లో జన్మించారు. తన ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం ఎస్పీజీ కీస్ హైస్కూల్​లో జరిగింది. తన 13వ ఏట పుణె పట్టణానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్​ లక్ష్మీనారాయణతో వివాహమైంది. వీరి ముద్దుల తనయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ మంత్రి శ్రీమతి గీతారెడ్డి. 

ఈశ్వరీబాయిపై  అంబేద్కర్​ ప్రభావం

ఈశ్వరీబాయి భర్త అకాల మరణం తర్వాత తన కూతురితో హైదరాబాద్​ వచ్చి ఎవరిపైన ఆధారపడకుండా, తన స్వశక్తితో తనను తాను మలుచుకున్న తీరు అద్వితీయం. పుణె కేంద్రంగా సామాజిక పోరు సల్పిన పూలే దంపతుల ఆదర్శాలను, ఆశయాలను తన మదిలో నింపుకున్న ఈశ్వరీబాయి విద్యే మానవ మేధస్సును వికసింపజేస్తుందని బలంగా నమ్మారు. తానే ఉపాధ్యాయురాలిగా పరోపకారిణి పాఠశాలలో చేరి ఎందరినో  విద్యాకుసుమాలుగా తీర్చిదిద్దింది. నిరంతరం ప్రజా సమస్యల పరిష్యారం కోసం పరితపించేవారు. తమ సోదరి సేవానిరతిని గమనించిన కిషన్​, ఆమెను రాజకీయ రంగం వైపు మళ్లించేందుకు కృషి చేశారు. ఈశ్వరీబాయిపై అంబేద్కర్ పోరాటల ప్రభావం ఉంది. 1942లో నాగపూర్​లో జరిగిన అఖిల భారతీయ దళిత వర్గాల మహాసభలో షెడ్యూల్డ్​ కులాల వారికి హక్కులు, అధికారం కోసం ఒక రాజకీయ పార్టీ అవసరం అని భావించిన అంబేద్కర్​ దేశ నలుమూలల నుంచి వేలాదిమంది దళిత ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ‘అఖిల భారతీయ షెడ్యూల్డ్​ కులాల ఫెడరేషన్​’ అనే పార్టీని స్థాపించడం జరిగింది.  ఆ పార్టీ ఆశయాలను, లక్ష్యాలను ఈశ్వరీబాయి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాను నివసించే చిలకలగూడలో పేదల మనిషిగా ఆ ప్రాంతంలో  ఈశ్వరీబాయి చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలాంటి అంగబలం, అర్థబలం లేకున్నా కూడా 1952లో  మొదటిసారి హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎన్నికయ్యారు. 

దళితజాతి అభ్యున్నతికి పోరాటం

హైదరాబాద్​ కేంద్రంగా దళిత జాతి విముక్తి కోసం పోరుసల్పిన భాగ్యరెడ్డి వర్మ, బీఎస్​ వెంకట్రావ్ వంటి వారి పోరాటాల నుంచి స్ఫూర్తి పొందారు. దళిత జనోద్ధరణకు అడుగులు వేస్తూ షెడ్యూల్డ్​కులాల ఫెడరేషన్​కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. షెడ్యూల్​ కాస్ట్​ ఫెడరేషన్​ను రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియాగా మార్చాలనుకున్న బాబా సాహెబ్​ పార్టీ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాలని పిలుపునిచ్చారు. కానీ అంతలోనే 1956లో అంబేద్కర్​ మహా పరినిర్యాణం చెందారు.  రాజకీయ ప్రలోభాలు పెట్టినా అణగారిన ప్రజల అభ్యున్నతికే చివరి వరకూ పాటుపడారు.  1967లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్​ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఆర్​పీఐ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి దేవాదాయశాఖ మంత్రి సదాలక్ష్మిపై గెలుపొంది సంచలనం సృష్టించారు. 1968లో రాష్ట్రంలో దళిత ఉద్యమానికి భూమిక అనదగిన కంచికచర్ల కోటేశ్​ సజీవ దహన దురంతాన్ని నిండు అసెంబ్లీలో లేవనెత్తి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్​ చేసి అసెంబ్లీని స్తంభింపజేశారు. ఆ సభలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి తిమ్మరెడ్డి దళితజాతి ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిండు సభలోనే అతనికి తన కాలి చెప్పును చూయించి దళితజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వీరవనిత ఈశ్వరీబాయి. 

మహిళల ఆత్మగౌరవం కోసం..

మహిళా, కార్మిక, రైతు, విద్యార్థి సమస్యలపై, భూసంస్కరణలు, పంచాయతీరాజ్​ వ్యవస్థపై అసెంబ్లీలో ఆమె చేసిన ప్రసంగాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. మహిళలు స్వశక్తితో, ఆత్మగౌరవంతో బతకాలంటే చదువు అత్యవసరమని, రెసిడెన్షియల్​ పాఠశాలలు ప్రభుత్వం నెలకొల్పాలని అసెంబ్లీలో ఈశ్వరీబాయి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అప్పటి నిజామాబాద్​జిల్లా కలెక్టర్​ ఎస్ఆర్ శంకరన్​ అనునిత్యం ప్రోత్సహించేవారు. నాలుగు దశాబ్దాల క్రితమే దళిత బాలబాలికలకు ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు.  1977లో లోక్​సభకు జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలోని అమలాపురం నుంచి లోక్​సభకు పోటీచేసి దాదాపు లక్షా డెబ్బైవేల ఓట్లతో అక్కడ ప్రజల అభిమానం పొందారు. ఈశ్వరీబాయి చిత్తశుద్ధితో చేసిన సేవ ఆమెకు దళిత పక్షపాతిగా గుర్తింపు తెచ్చింది.  సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా రిపబ్లికన్​ పార్టీ ఆఫ్​ ఇండియా (ఆర్​పీఐ)కి ఆమె జాతీయ అధ్యక్షురాలిగా ఎదిగిన తీరు అద్వితీయం. ఆమె ఆశయమైన  సమసమాజ స్థాపనకు కృషి చేయడమే ఈశ్వరీబాయికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళి. 

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర

ఈశ్వరీబాయి 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 1971లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 11లోక్​సభ సీట్లును గెలుపొందడంలో కీలకపాత్ర పోషించారు. 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రజాసమితి నాయకులు పదవులకు ఆశపడి ఉద్యమానికి ద్రోహం చేసినా ఈశ్వరీబాయి మరికొందరు మాత్రం తెలంగాణ వాదులతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ‘సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి’ని స్థాపించారు. ముల్కి రూల్స్ గురించి, వాటిపై అప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి గురించి, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, 1969 ఉద్యమంలో జరిగిన కాల్పుల్లో మరణించిన అమరుల గురించి,శాసన సభలో అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అసెంబ్లీలో హరిజనులు అనే పదం వాడటంపై కూడా ఈశ్వరీబాయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను హరిజనులు అనకుండా షెడ్యూల్డ్​ కులాలు అని సంబోధించాలని ఆమె సూచించారు. 

- అంగరి ప్రదీప్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్​ మాల స్టూడెంట్స్ అసోసియేషన్