
బోధన్, వెలుగు: క్రిస్టియన్ మతంలో ఉన్న దళితులకు కూడా దళిత బంధు అందజేస్తామని ఎమ్మెల్యే షకీల్ అమేర్ చెప్పారు. సోమవారం పట్టణంలోని రవి గార్డెన్‌లో తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బట్టలను క్రిస్టియన్లకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగా ఎంతో పవిత్రమైందని కొనియాడారు. శక్కర్‌నగర్‌లో రూ.50 లక్షలతో చర్చి నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రజితయాదవ్, ఎంపీపీ బుద్దె సావిత్రి, ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ ప్రేమ్‌కుమార్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రవీంద్రయాదవ్, చర్చి ఫాదర్లు థామస్, విన్ సెంటో, ఫ్రాంకింగ్, సందీప్, అనంతయ్య పాల్గొన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని బోధన్ రూరల్, టౌన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాలకు చెందిన 277మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
నిందితులను వదలం..
డిగ్రీ స్టూడెంట్ శ్రీకాంత్ హత్య మిస్టరీ కేసును అన్ని కోణాల్లో పోలీసులు సీరియస్‌గా విచారణ చేపడుతున్నారని, నిందితులను ఎట్టి పరిస్థితిలో వదలమని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఈ కేసుపై తాను స్వయంగా డీజీపీకి, సీపీ, సీయం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. కేసును సీబీ సీఐడీకి అప్పగించాలని కోరినట్లు తెలిపారు.
డాక్టర్లు సేవా గుణంతో పనిచేయాలి
నిజామాబాద్ టౌన్, వెలుగు: డాక్టర్లు సంపాదన కోసమే కాకుండా సేవా గుణంతో పనిచేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు, ఒత్తిడిని పెరిగినప్పుడు నరాలు బలహీన పడి రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించి నమ్మకం పెంచుకోవాలని సూచించారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇందూరులో కొత్తగా నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అధునాతన సౌకర్యాలతో చికిత్స అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మేయర్ నీతూ కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమిస్తాం..
నిజామాబాద్, వెలుగు: అర్బన్‌లో సర్కార్ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమిస్తామని, ఈ స్థలాల్లో చేపట్టే నిర్మాణాలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పేరిట నగరంలో ప్రభుత్వ పాత భవనాలను కూల్చి వేసి ఆ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలని నేడు చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నిరసనకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ లీడర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బురుగుల వినోద్, మాస్టర్ శంకర్, పంచరెడ్డి శ్రీధర్, వినోద్‌రెడ్డి, సుక్క మధు, భాస్కర్‌రెడ్డి, రోషన్, రాజు, ప్రభాకర్, ఆనంద్ పాల్గొన్నారు.
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
కోటగిరి, వెలుగు: బాన్సువాడలో బీజేపీతో నడుస్తూ పార్టీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పార్టీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మాల్యాద్రిరెడ్డి పేర్కొన్నారు. మండలంలో చేపడుతున్న బీజేపీ కార్యకర్తల భరోసా యాత్రను సోమవారం యాద్గార్‌పూర్, ఎత్తొండ, కోటగిరి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు లేనిపోని కారణాలు చూపి బీఆర్‌ఎస్ లీడర్లు పెన్షన్‌లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దేశం కోసం.. ధర్మం కోసం కార్యకర్తలు బీజేపీతోనే కొనసాగడం గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ బాన్సువాడ కన్వీనర్ భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సూర్యకాంత్, సాయాగౌడ్, నాగం సాయిలు, గురునాథ్ పాల్గొన్నారు.