బడంగ్ పేట్ లో దళితుల ధర్నా.. అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తత

బడంగ్ పేట్ లో దళితుల ధర్నా.. అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ లో దళితులు ధర్నా చేపట్టారు. మా భూమి మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ (దావూద్ ఖాన్ గూడ) గ్రామంలోని సర్వేనెంబర్ 2లోని భూమిని గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని కొంతమంది దళితులు చెబుతున్నారు. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని తమకు కాదని బయటివారికి కేటాయిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ధర్నాలో పాల్గొన్నారు.

భూములను సాగు చేసుకుంటున్న తమ తల్లిదండ్రులను కిస్తీ కట్టాలని అనాటి పట్వారి పటేల్ (50 ఏళ్ల క్రితం) ఆదేశించాడని, కిస్తీలు కడితేనే భూములు దున్నుకోవడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తే.. తమ వాళ్లు అప్పులు చేసి కట్టారని బీఎస్పీ నాయకులు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అనాడు తమ పూర్వీకులు రెక్కల కష్టంతో భూములను కాపాడుకుంటూ వచ్చి తమకు ఇచ్చారని, ఈ సమయంలో తమకు కేటాయించకుండా బయటివారికి ఇస్తున్నారని ఆరోపించారు. తమ భూములు తమకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని గుడ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. తమ భూములను అగ్రవర్ణాలకు చెందిన వారికి కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

అరెస్ట్ తో ఉద్రిక్తత

బడంగ్ పేట్ లో ధర్నా చేస్తున్న దళితులను అరెస్ట్ చేసి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. దీంతో హయత్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు మద్దతు ఇచ్చేందుకు హయత్ నగర్ పీఎస్ కు మహేశ్వరం బీజేపీ పార్టీ ఇన్ చార్జ్ అందెల శ్రీరాములు వెళ్లారు. దీంతో అందెల శ్రీరాములుతో పాటు బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు పోలీసులు. బయటకు పంపుతున్న సమయంలో తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు బీజేపీ నాయకులు. పీఎస్ నుంచి బయటకు పంపుతున్న సమయంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది.