
- సర్కారు తీరుతో రాష్ట్రానికి నష్టం
- నీటి వాటాల నుంచి ఏపీ అక్రమ ప్రాజెక్టుల దాకా దాటవేత
- పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంతో నీళ్లు మళ్లిస్తున్నా నిర్లక్ష్యం
- మన వాటా నీటినీ సరిగ్గా వాడ్తలే..పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తలే
- శ్రీశైలం కరెంటు ఉత్పత్తిపైనా తప్పుడు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు రాష్ట్రానికి తీరని నష్టం తెచ్చి పెడుతున్నాయి. నీటి వాటాల నుంచి మొదలుకొని ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల దాకా అన్ని అంశాల్లో సర్కారు తీరు రివర్స్ కొడుతోంది. ఏపీ జల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన సీఎం కేసీఆర్.. గోదావరి జలాలను తెచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పడం అక్కడి పాలకులకు ఊతమైంది. దీంతో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తోంది. శ్రీశైలం నుంచి నీటిని మలుపుకునేందుకు ఇప్పటికే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతలు నిర్మిస్తున్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకూ పూనుకున్నది. తాజాగా కరెంట్ ఉత్పత్తిపై మార్గదర్శకాలు రూపొందించేందుకు కృష్ణా బోర్డు మీటింగ్‌లో కమిటీ ఏర్పాటుకు ఒప్పుకున్న టీఆర్ఎస్ సర్కారు.. తీరా ఆ సమావేశానికి డుమ్మా కొట్టింది. మీటింగ్‌కు హాజరైతే కరెంట్‌పై కమిట్ కావాల్సి వస్తుందనే
ఇట్ల చేసింది.
ముందు నుంచీ నిర్లక్ష్యం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 11 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పుడు దీనిపై పోరుబాట పట్టిన టీఆర్‌ఎస్.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ మాటే మరిచింది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతో దోస్తీ కట్టిన కేసీఆర్.. గోదావరి నీళ్లతో రాయలసీమను రాతనాల సీమ చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల నుంచి 88 వేల క్యూసెక్కులకు పెంచేందుకు, అదనంగా 3 టీఎంసీల నీళ్లను సంగమేశ్వరం ద్వారా శ్రీశైలం అడుగు నుంచి ఎత్తిపోసుకునేందుకు పూనుకున్నా నోరు విప్పలేదు. ఏపీ సంగమేశ్వరం లిఫ్ట్ చేపట్టకుండా అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని డిమాండ్ చేయలేదు. కేంద్రమే జోక్యం చేసుకొని 2020 ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసినా అప్పటికప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని డుమ్మా కొట్టారు. తర్వాత అపెక్స్ మీటింగ్‌కు హాజరైనా.. అప్పటికే సంగమేశ్వరం పనులు కూడా మొదలయ్యాయి. ఆ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియకు అడ్డుపడకుండా ఉండేందుకే అపెక్స్‌కు హాజరుకాలేదని రాష్ట్ర సర్కారుపై విమర్శలు వచ్చాయి.
కరెంటుపై ఏపీ కిరికిరి..
శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తిపై ఏపీ రెండేళ్లుగా నానా రభస సృష్టిస్తోంది. తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేయకుండా ఆపాలని సుప్రీంకోర్టులో కేసు వేసింది. ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ కరెంట్ ఉత్పత్తిపై ఏపీ డజనుకుపైగా కంప్లైంట్లు చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోవడానికి శ్రీశైలంలో 854 అడుగుల లెవల్ వచ్చే దాకా కరెంట్ ఉత్పత్తి చేయవద్దని వాదిస్తోంది. కృష్ణా బోర్డు కూడా ఏపీ వాదనకే వంత పాడుతోంది. ఈ విషయాలన్నీ తెలిసినా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కరెంట్ ఉత్పత్తిపై మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు అంగీకారం తెలిపింది. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా సిస్టం కింద సాగునీటి అవసరాలు ఉంటే తప్ప శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయవద్దనే నిబంధన, 854 అడుగుల నీటిమట్టం అనే అంశాలపై కమిట్ కావాల్సి వస్తుందనే శుక్రవారం తలపెట్టిన మీటింగ్‌కు డుమ్మా కొట్టింది. కరెంట్ ఉత్పత్తిపై మార్గదర్శకాలకు కమిటీ ఏర్పాటు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమని తెలిసినా ఒప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అక్రమ ప్రాజెక్టులపై స్పందించలే
ఏపీ ప్రభుత్వం 2020 మే నెలలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో పాటు సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలకు రూ.7 వేల కోట్లతో పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఆ వెంటనే సంగమేశ్వరం టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఏపీ టెండర్లు ఖరారు చేసి, ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి చేసింది. కేవలం పంపులు, మోటార్లు మాత్రమే బిగించాల్సి ఉంది. సర్కారు స్పందించకపోవడంతో నారాయణపేట జిల్లాకు చెందిన రైతు ఎన్‌జీటీని ఆశ్రయించి ఆ ప్రాజెక్టు పనులు ఆపివేయించాడు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తో పాటు దాని ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణకు ఏపీలో టెండర్లు పిలిచారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్, గైడ్ బండ్స్ నిర్మాణానికి పూనుకున్నారు. ఏపీ అక్రమంగా పనులన్నీ చేస్తున్నా కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఏపీ ఆర్డీఎస్ రైట్ కెనాల్ పేరుతో మరో అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తోంది.
పునాదులు దాటని ‘పాలమూరు’ ప్రాజెక్టు
గోదావరిపై ప్రాజెక్టులు వేగంగా నిర్మిస్తున్న రాష్ట్ర సర్కారు.. కృష్ణా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో మొదట పునాది రాయి వేసిన పాలమూరు– రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌లు ఏడేళ్లు గడిచినా పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. కృష్ణా జలాలు సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచలేదు. బోర్డు మీటింగుల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని చెప్పడం.. చివరికి మన రాష్ట్రానికి 34 శాతం నీళ్లు ఇస్తామన్న పాత ప్రతిపాదనకే ఒప్పుకోవడం పరిపాటిగా మారింది. నీళ్ల పంపకాల విషయంలో ప్రభుత్వ అలసత్వంతో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కాయి. ఏపీ 512 టీఎంసీలను తీసుకుంటోంది. కృష్ణా బోర్డు ఏర్పడిన మొదటి రెండేళ్లు తెలంగాణకు 37 శాతం, ఏపీకి 63 % వాటా ఉండేది. కోటా మేరకు నీళ్లు తీసుకోలేక 34 శాతం వాటాకే సర్కారు అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది.