ఆడపిల్లల చదువుతో సమాజంలో మార్పు : దామోదర రాజనర్సింహ

ఆడపిల్లల చదువుతో సమాజంలో మార్పు :  దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబ పరిస్థితులు మెరుగు పడడంతో పాటు సమాజంలో మార్పు వస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఆందోల్, జోగిపేట మున్సిపల్ పరిధిలో  రూ.138 కోట్ల  విలువైన పలు అభివృద్ధి పనులకు, కలెక్టర్  క్రాంతి వల్లూరుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్​ ప్రభుత్వం విద్యారంగానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. జిల్లాలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్​ జోగిపేటలోనే ఏర్పాటైందని గుర్తుచేశారు. బీకాం జనరల్ కోర్సును తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  

 పట్టణంలోని గవర్నమెంట్​హాస్పిటల్​లో రూ.2.30  కోట్లతో మార్చురీ రూమ్​,  ఇంటర్నల్ రోడ్లు,​ రూ.6 కోట్లతో మున్సిపల్ కొత్త భవనం, రూ.4.15 కోట్లతో డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్​, సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్​ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్ల నిధులతో సంగుపేట నుంచి అన్నసాగర్ వరకు నాలుగు లైన్ల నేషనల్ హైవే రోడ్డు బటర్ ఫ్లై లెట్స్ , రూ. 2 కోట్ల నిధులతో జోగిపేట స్టేడియం అభివృద్ధి, ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 

రూ.80 కోట్ల నిధులతో జోగిపేట నుంచి అజ్జమర్రి వరకు మంజీరా నది పై వంతెనతో పాటు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు గృహ జ్యోతి జీరో బిల్లులు అందజేశారు. ఆర్అండ్ బీ  ఈఈ  రాంబాబు, ఈపీహెచ్ వో వీర ప్రతాప్, డీసీహెచ్ వో  సంగారెడ్డి , ఆర్డీవో పాండు, టీఎస్ఈడబ్లూఐడీజీ ​డిప్యూటీ ఈఈ రాంకుమార్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ భాస్కర్, కేజీబీవీ  ప్రిన్సిపల్స్ జ్యోతి, మాజీ ఎంపీసురేశ్ షెట్కార్,  సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .