ప్రభుత్వ భూములకు రికార్డులు ఉండాలి : దామోదర రాజనర్సింహా

ప్రభుత్వ భూములకు రికార్డులు ఉండాలి : దామోదర రాజనర్సింహా

గద్వాల /అలంపూర్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ భూములకు ఒరిజినల్  రికార్డులు ఉండాలని హెల్త్  మినిస్టర్  దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాభివృద్ధికి ఆఫీసర్లంతా కృషి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు.

మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి రికార్డులు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు ఒరిజినల్  రికార్డులను ఉండేలా చూడాలని ఆఫీసర్లకు సూచించారు. జిల్లాలో మూడేండ్లలో అదనపు ఆయకట్టు ఎంత పెరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. జూరాల, నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్, ఆర్డీఎస్  ప్రాజెక్టులపై పవర్ పాయింట్  ప్రజెంటేషన్  కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ సంతోష్, జడ్పీ చైర్​పర్సన్  సరిత, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి ఉన్నారు.

హామీ ఇచ్చి మాట తప్పిన్రు..

కృష్ణా పుష్కరాల సమయంలో గత సర్కారు అలంపూర్  ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని మంత్రి విమర్శించారు. అలంపూర్  ఆలయాలను ఆయన దర్శించుకొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రిని పూలమాల, శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలాఉంటే ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్  నాయకులు  సంపత్ కుమార్​ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్  నాయకులు చల్లా నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురండి..

అలంపూర్  చౌరస్తాలో కొత్తగా నిర్మించిన 100 బెడ్స్  ఆసుపత్రిని, గద్వాలలోని 300 బెడ్స్  హాస్పిటల్ ను మంత్రి దామోదర్  రాజనర్సింహా ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్  సరిత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్లు అపూర్వ చౌహన్, శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. సౌలతులు కల్పించి, వైద్య సిబ్బందిని నియమించి వీలైనంత త్వరగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు.

అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలు గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని కొత్త గ్రామపంచాయతీని ప్రారంభించి అక్కడ మీటింగ్ లో పాల్గొన్నారు. పట్టాలు గుంజుకున్న 1,400 మందికి కాంగ్రెస్  ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్ శశికళ, ఆసుపత్రి సూపరింటెండెంట్  సయ్యద్ పాషా, ఆర్డీవో చంద్రకళ పాల్గొన్నారు.