ప్రజా పాలన విజయవంతం చేయాలె : దామోదర రాజనర్సింహా

ప్రజా పాలన విజయవంతం చేయాలె : దామోదర రాజనర్సింహా
  •    రాష్ట్ర  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేవిధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీసులో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటి ఆచరణ, అమలులో అధికారుల పాత్ర కీలకమన్నారు.  ప్రజలకు జవాబుదారీగా అధికారుల పనితీరు ఉండాలన్నారు.

ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించాలన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేస్తుందన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, స్వీకరించిన ప్రతి అప్లికేషన్​కు రశీదు ఇవ్వాలని సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ శరత్ ప్రజా పాలన కార్యక్రమ నిర్వహణ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై మంత్రికి వివరించారు.

కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.