గిరిజన గూడాల్లో దండారీ పండగ.. ఆకర్షణగా గుస్సాడీ నృత్యం

గిరిజన గూడాల్లో దండారీ పండగ.. ఆకర్షణగా గుస్సాడీ నృత్యం

తరాలు మారుతున్నా అడవి బిడ్డలు తమ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. పూర్వీకులు ఆస్తిగా అందించిన ఆచారాలను ఏటా తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి పండగల్లో దండారీ ఉత్సవాలు కూడా ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు.. తమ గూడేల్లో దండారీ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఏటా దీపావళికి ముందు ప్రారంభమయ్యే ఈ వేడుకలతో పాటు... గుస్సాడీ వేషాల గురించి తెలుసుకుందాం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజేన్సీ లో నివసించే ఆదివాసీలు.. తమ సంస్కృతి సంప్రదాయాలతో పండగలు జరుపుకుంటారు. ఏ పండగైనా ఆదివాసీలు కలిసి కట్టుగా నిర్వహిస్తారు. ఇప్పుడు దీపావళికి దండారీ వేడుకలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ కొండకోనల్లో పది రోజుల పాటు ప్రతి రాత్రీ తుడుం, డప్పు చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీల ప్రత్యేక వేషాలు, నృత్యాలు, వంటలు, ఆచారాలు... అన్నీభిన్నంగా ఉంటాయి. తాత,ముత్తాతల నుంచి గోండులు దండారి ఉత్సవాలు-గుస్సాడి నృత్యాలను చేస్తున్నారు. ఆదివాసీలు ఆశ్వయుజం నెలలో... పౌర్ణమి తర్వాత వచ్చే మంచి రోజు నాడు ఇండ్లు,  వాకిలి అలికి అలంకరిస్తారు. ఊరి పటేల్ ఇంటి ముందు ఈ దండారీ వేడుకలను నిర్వహిస్తారు. ముండ అనే పెద్ద కర్ర స్తంభం చుట్టూ గుండ్రంగా చేసే నృత్యాలతో దండారి ఉత్సవాలు మొదలవుతాయి.

దండారి ఉత్సవాల్లో అకాడి రోజుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండుగలో మాత్రమే వాడే గుమేల, పర్ర, పెట్టె అనే  వాయిద్యాలను బయటకు తీసి అలంకరిస్తారు. వాటితో పాటు టప్పల్ , కోడల్  అనే ముఖానికి పెట్టుకునే కవచాలు, గుస్సాడీల కంకాలి టోపీలు, ఆభరణాలు, మంత్రదండం, మెడలో రుద్రాక్షలు, రోకళ్లతో సామూహికంగా పూజ చేసి... వాయిద్యాలను మోగిస్తారు. వీటికి నైవేధ్యం సమర్పించడంతో దండారీ వేడుకలు మొదలవుతాయి. ఒక ఊరి దండారి బృందం రెండు, మూడు ఊళ్లకు వెళ్తుంది. తెల్లని ధోతులు, నడుముకు, తలకూ తెల్లని లేదా ఎరుపు, ఆకుపచ్చ రంగుల రుమాళ్ళు కట్టుకొని... కోలలు పట్టుకొని నృత్యాలు చేస్తారు. మాన్కోలా, చచ్చోయ్  నృత్యాలకు దండారీలో ప్రత్యేకత ఉంది. సంప్రదాయంగా వందల ఏళ్ల నుంచి వచ్చే వాయిద్యాలు వాయిస్తుంటే.. గోండు భాషలో పాటలు పాడుతూ లయబద్దంగా ఆడుతూ పాడుతుంటారు. 

దండారీలో భాగంగా ముందుగా మగవారు నృత్యాలు చేసి.. నాటక ప్రదర్శనలు ఇస్తారు. తర్వాత మహిళలు లయబద్దంగా నృత్యాలు చేస్తారు. పెళ్లి కాని ఓ ఆడపడుచు గునుగు పూల కట్ట పట్టుకొని నృత్యం ప్రారంభించగా.. మిగతా మహిళలు ఒకరి భుజంపై ఒకరు చేతులు వేస్తూ.. ముందుకెళ్తారు. ఈ దృశ్యాన్ని పైనుంచి చూస్తే... పువ్వు ముడుచుకోవడం.. విచ్చుకోవడం లాగా కనిపిస్తుంది. 
                              
దండారి వేడుకల్లో గుస్సాడీ నృత్యాలకు ప్రత్యేకత ఉంది.  నెత్తిన నెమలి ఈకలతో టోపీలు.... చేతిలో మంత్ర దండం.... మెడలో రుద్రాక్ష మాలలు.... కాళ్ళకు, నడుముకు గజ్జెలు.... ముఖానికి విభూతి... నల్లటి, తెల్లటి చారలతో గీతలు... గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలు, భుజాన జంతువు చర్మం... ఇలా ప్రత్యేక ఆకర్షణగా కనబడతాయి గుస్సాడీ వేషాలు. కోరికలు నెరవేరాలని గూడెం యువకులు గుస్సాడి వేషాలు  కడతారు. పది రోజులు నియమనిష్ఠలలో ఉండి...దండారి సంబురాల్లో పాల్గొంటారు గుస్సాడీలు. దీక్షతో ఉన్న వారం, పది రోజులు స్నానం చేయకుండా, కట్టిన బట్టలు విడవకుండా, నేలపైనే పడుకుంటూ.. దీక్షలు చేస్తుంటారు గుస్సాడీలు. ఇలా చేస్తే.. దేవుడు తాము కోరుకున్నవి నెరవేరుస్తాడని ఆదివాసీల నమ్మకం. గుస్సాడీల చేతిలో ఉండే మంత్రదండాన్ని తాకిస్తే రోగాలు పోతాయని ఆదివాసీలు నమ్ముతుంటారు. ఈ వేషాల్లో ఉన్న గుస్సాడీలను దేవుళ్లుగా పూజిస్తారు ఆదివాసీలు. గుస్సాడీలను శ్రీకృష్ణుడు, పరమశివుడిగా భావిస్తారు

గుస్సాడిలు పెట్టే టోపీలు దాదాపు 10, 15 దండారి పండుగల దాకా పవిత్రంగా ఉంటాయి. ఇంత నాణ్యమైన టోపీలను కొందరు నిపుణులైన గోండులు, కొలాంలు మాత్రమే తయారు చేస్తారు. నెమలి ఈకలతో వీటిని తయారు చేస్తారు. టోపీకి చుట్టూ, ముందు వైపు కొన్ని వరుసల్లో పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, గుడ్డ పట్టీలు, ఇలా పలు ఆకారాల చెమికీ బిళ్లలు, చిన్న చిన్న గంటల మాలలు ఉంటాయి. రెండు పక్కల జింక కొమ్ముల తోనూ గుస్సాడీ టోపీలను అలంకరిస్తారు. అందుకే ఆ టోపీలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. 

దండారిలో ఒక ఊరి వారు మరో గ్రామానికి అతిధులుగా వెళ్తారు. చీకటి పడకముందే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే దండారి బృందం వెళ్తుంది. వృద్దులు, చంటి పిల్లల, తల్లుల కోసం ఎడ్ల బండ్లను వాడతారు. వారితో తీసుకెళ్లే ప్రతీ సామాగ్రిని కూడా మోసుకెళ్తారు. విందులు, వినోదాలు, ముచ్చట్లతో... ఓ రాత్రి విశ్రాంతి తీసుకొని తెల్లారి ఆటలాడి, పాటలుపాడి, ఖేల్  ప్రదర్శనల్లో పాల్గొంటారు. దండారి వల్ల ఆదివాసీలకు మరో ప్రయోజనం ఉంటుంది. బృందంలోని పెళ్లికాని యువకులు తమకు తగిన వధువులు వెతుక్కుంటారు. పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం లాంటివి దండారీ తర్వాత జరుగుతాయి. 

దీపావళి అమావాస్య తర్వాత ఒకటి రెండు రోజుల్లో జరిపే కోలబోడితో దండారి ఉత్సవాలు ముగుస్తాయి. ఊరు బయట ‘చెంచి భీమన్న’ దేవుడుండే ఇప్పచెట్టు దగ్గర దండారీ వాయిద్యాలు, బట్టలు, ఆభరణాలు తీసేసి.. వాటి ముందు బలిచ్చి, పూజలు చేస్తారు. విందు భోజనం తర్వాత అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకెళ్తారు. చివర్లో గుస్సాడీల దగ్గరలో ఉన్న చెరువు, కాలువకో వెళ్లి స్నానం చేసి దీక్ష విరమిస్తారు. గుమేల, పర్ర, వెట్టె లాంటి దండారి వాయిద్యాలు మళ్లీ వచ్చే అకాడి పండుగ దాకా దాచి ఉంచుతారు. 

గోండుల పౌరాణిక గాథలు, సంస్కృతి తెలియని వారికి ఒక్కసారి చూస్తే చాలు.. మంచి అనుభూతి మిగులుస్తుంది దండారీ ఉత్సవం. ఈ పండగ చూడాలంటే దీపావళికి ముందు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి రావాల్సిందే. ఈమధ్యే గుస్సాడి నృత్యాన్ని కాపాడుతున్నందుకు కనకరాజుకి పద్మశ్రీ రావడంతో దేశం మొత్తం ఈ ఉత్సవంపై చర్చ జరిగింది.