WI vs AUS 2025: అదృష్టం అంటే ఇదే: రెండేళ్లుగా జట్టుకు దూరం.. రీ ఎంట్రీలోనే ఆస్ట్రేలియాపై కెప్టెన్సీ

WI vs AUS 2025: అదృష్టం అంటే ఇదే: రెండేళ్లుగా జట్టుకు దూరం.. రీ ఎంట్రీలోనే ఆస్ట్రేలియాపై కెప్టెన్సీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 లో భాగంగా వెస్టిండీస్ తొలి టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా  బుధవారం (జూన్ 25) ఆస్ట్రేలియాతో ప్రారంభం కానుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. స్వదేశంలో సిరీస్ జరుగుతుండడంతో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ జట్టు ఎలాగైనా షాక్ ఇవ్వాలని చూస్తుంది. వెస్టిండీస్ జట్టును స్పిన్ ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ తన కెప్టెన్సీతో జట్టును నడిపించనున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి క్రెయిగ్ బ్రాత్‌వైట్ గత నెలలో  వైదొలిగాడు. అతని స్థానంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ ను టెస్ట్ కెప్టెన్ గా శనివారం (మే 17) అధికారికంగా ప్రకటించింది. 

ఛేజ్ రెండు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఆడకున్నా ఈ స్పిన్ ఆల్ రౌండర్ కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రోస్టన్ చేజ్ మార్చి 2023లో దక్షిణాఫ్రికాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రెండు సంవత్సరాలుగా సుదీర్ఘమైన ఫార్మాట్‌కు దూరంగా ఉన్న అతను తిరిగి జట్టులోకి రావడమే కాకుండా కెప్టెన్సీకి ఎంపికయ్యాడు. 2023 నుండి వెస్టిండీస్ 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అయితే  చేజ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌గా పరిగణించలేదు. అయితే అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించి కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం విశేషం. 

ALSO READ | ENG vs IND 2025: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. సచిన్, ద్రవిడ్ ఆల్‌టైం రికార్డ్స్‌పై రూట్ కన్ను

2016 నుంచి ఛేజ్ వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 49 టెస్టుల్లో 26.33 సగటుతో 2265 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 85 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ వెస్టిండీస్ జస్టిన్ గ్రీవ్స్, జాషువా డా సిల్వా, జాన్ కాంప్‌బెల్, జోమెల్ వారికన్, టెవిన్ ఇమ్లాచ్, రోస్టన్ చేజ్‌లను టెస్ట్ కెప్టెన్సీ అభ్యర్థులుగా షార్ట్‌లిస్ట్ చేసింది. తీవ్రమైన పరిశీలన తర్వాత, అధికారులు రోస్టన్ చేజ్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించారు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో వెస్టిండీస్ 6 గురు బ్యాటర్లు.. ఒక స్పిన్ ఆల్ రౌండర్.. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్.. ముగ్గురు పేసర్లతో ప్లేయింగ్ 11 ప్రకటించింది.