ప్లాస్టిక్​తో పోరులో గ్లోబ్​

ప్లాస్టిక్​తో పోరులో గ్లోబ్​

ప్లాస్టిక్​ వాడడం వల్ల ఏమవుతుందో అనే అవేర్​నెస్​ కల్పించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్​కు చెందిన బెవర్లి బర్కత్ అనే ఒక ఆర్టిస్ట్ కూడా ఆ కాన్సెప్ట్​ మీద ఒక పెయింటింగ్ వేయాలనుకుంది. అందుకోసం కొన్ని విషయాలను తెలుసుకునేటప్పుడే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ప్లాస్టిక్​తోనే అది ఎంత ప్రమాదకరమో చెప్పాలి అనుకుంది. అందుకే వేరే దేశాల నుంచి వేస్ట్ ప్లాస్టిక్​ కలెక్ట్ చేసి మరీ గ్లోబ్​ తయారుచేసింది. దాని పేరు ‘ఎర్త్ పొయెటిక’. 

ఈ ప్రాజెక్ట్​ కోసం...

ఇజ్రాయెల్​లోని జెరూసలేంలో ఉంటోంది బెవర్లి బర్కత్​. మూడేండ్లుగా వేరే వేరే ప్రాంతాలు తిరిగి ప్లాస్టిక్​ వేస్ట్​ను కలెక్ట్ చేయడమే పనిగా పెట్టుకుంది. అయితే మధ్యలో కరోనా వైరస్​ వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆమె ఎక్కడికీ వెళ్లలేకపోయింది. అయితే ఆమె చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలిసిన కొందరు, వాళ్ల దేశాల నుంచి ఆమెకు ప్లాస్టిక్​ వేస్ట్​ను పంపేవాళ్లు. వాటితోపాటు ఇజ్రాయెల్​లోని మెడిటేరియన్​ తీరాల్లో  కనిపించిన తెగిపోయి, ఒడ్డుకు కొట్టుకొచ్చిన వలల్ని కలెక్ట్ చేసుకుంది. ప్లాస్టిక్​ కూడా వైరస్​ లాంటిదే. ప్లాస్టిక్​ వేస్ట్ పెరిగేకొద్దీ అది ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. వైరస్​ వల్ల శరీరం దెబ్బతిన్నట్టే, ప్లాస్టిక్​ వల్ల ఎకోసిస్టం దెబ్బతింటుందనే విషయాలు ప్రజలకు ప్యాండెమిక్​లో బాగా అర్థమయ్యాయి అంటోంది బెవర్లి. 


55 ఏండ్ల వయసులో ఈ ప్రాజెక్ట్ చేయడం అవసరమా? అని అడిగితే... ‘‘ఈ ప్రాజెక్ట్​ నాకు చాలా ఇంపార్టెంట్. నా క్రియేటివిటీతో, నా పద్ధతిలో ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నా. అందుకే ఎర్త్​ పొయెటిక అనే ప్రాజెక్ట్​ను సెలక్ట్ చేసుకున్నా. ఈ ప్రాజెక్ట్​ కోసం గ్లోబ్స్, గూగుల్ మ్యాప్స్, నాసా ఇమాజినరీ ఫొటోలను కలెక్ట్ చేశా. ఈ గ్లోబ్​ను తయారుచేసేటప్పుడు  ప్రపంచంలో ఏ ప్రదేశం ఎలా ఉంటుందో? గమనించి, దానికి తగినట్టు మెటీరియల్​ డిజైన్​ చేసుకున్నా. నాకు గ్లాస్​ బోయింగ్ కూడా వచ్చు. ఎర్త్ పొయెటికను తయారుచేయడానికి మెటల్ ఫ్రేమ్ ప్యానెల్స్, లోపలి వైపు వెదురు బొంగులు, రకరకాల ప్లాస్టిక్ వేస్ట్​లను వాడాను. బయటి నుంచి చూస్తే సముద్రాలు, ఖండాలు, అన్నీ మ్యాప్​లో చూసినట్టే కనిపిస్తాయి. ఈ గ్లోబ్​ మొత్తం నాలుగు మీటర్ల వ్యాసం ఉంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. వాటిలో నుంచి చూస్తే లోపల ఉన్న రకరకాల ప్లాస్టిక్ మెటీరియల్స్​ కనిపిస్తాయి. ఈ ‘ఎర్త్​ పొయెటిక’ను ఇజ్రాయెల్లోనే కాకుండా, ఇటలీ, తైవాన్​, జపాన్​, అమెరికాల్లో ఎగ్జిబిషన్​లో పెట్టా. దీన్ని ఇజ్రాయెల్​ అక్వేరియంలో ఆరు నెలలు ఉంచారు. ఆ అక్వేరియం పిల్లల ఎడ్యుకేషనల్​ ప్రోగ్రాంకు ఉపయోగపడింది. ఇన్​స్టాలేషన్​ టూర్లు కూడా ప్లాన్​ చేసుకునేలా చేసింది. ఇంతకు ముందు స్కూల్స్​లో లైబ్రరీలు పెట్టించా” అని ఎర్త్​ పొయెటిక గురించి చెప్పింది. 

ఫ్యామిలీ లైఫ్

జొహన్నెస్​బర్గ్​లో సెరామిస్ట్​లుగా పనిచేసే వాళ్లు బెవర్లి పేరెంట్స్. 1976లో బెవర్లీ వాళ్ల అమ్మానాన్నలకు ఆర్ట్స్ అండ్ డిజైన్​ అనే బెజలెల్ అకాడమీలో ఒక ఏడాది పనిచేసే అవకాశం వచ్చింది. దాంతో ఆమెకి పదేండ్లున్నప్పుడే వాళ్ల ఫ్యామిలీ ఇజ్రాయెల్​కు వచ్చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు అక్కడే ఇజ్రాయెల్​లోనే ఉండిపోయారు. బెవర్లి, జువెలరీ డిజైన్ చదువుకునేటప్పుడు ఆమె చిన్ననాటి ఫ్రెండ్ అయిన నిర్​ బర్కత్​ను పెండ్లి చేసుకుంది. ఆయన జెరూసలెం మేయర్ అయ్యాడు. అంతకుముందు అతను ఎంట్రప్రెనూర్​. అప్పుడప్పుడు ఆమె స్టూడియోకి వెళ్లి 
ఆమెకి పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా.