రిజల్ట్‌‌‌‌ ఏదైనా.. పాటతోనే ప్రయాణం

రిజల్ట్‌‌‌‌ ఏదైనా.. పాటతోనే ప్రయాణం

ఇతని పేరు మొన్న మొన్నటి వరకు ఆ ఊళ్లో వాళ్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లకు చాలామందికి తెలుసు. సంగీతంలో ఎలాంటి శిక్షణలేకున్నా, పాటమీద ఉన్న ఇష్టమే జీ తెలుగు సరిగమప స్టేజ్‌‌‌‌మీద కంటెస్టెంట్‌‌‌‌లా నిలబెట్టింది అంటున్నాడు డానియల్‌‌‌‌. అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చాడు?  సింగర్‌‌‌‌‌‌‌‌గా ఎలా మారాడు? ఆ విషయాలన్నీ అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు. 


ఈ షో తరువాత ప్లాన్స్‌‌‌‌ ఏంటి?
సరిగమప తరువాత అవకాశాలు రాకున్నా పాటను వదిలిపెట్టను. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. జాబ్ చేస్తూనే ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌‌‌‌ వాళ్ల బెస్ట్‌‌‌‌ ఇస్తున్నారు. మాలో టైటిల్ ఎవరికి వచ్చినా సంతోషమే. నాకు రావాలని కోరుకుంటా కదా.

సంగీతం నేర్చుకోలేదు కదా... మరి పాటల పోటీ వరకు రావడం ఎలా సాధ్యమైంది?
నేను ఇప్పటివరకు సంగీతం నేర్చుకోలేదు. మాది తూర్పు గోదావరి జిల్లా కొంకుదురు. సంగీతం నేర్చుకోవాలని ఉన్నా, చిన్న ఊరు కావడం వల్ల సంగీతం నేర్చుకోవడం కుదరలేదు. అయినా పాట మీద ఉన్న ఇష్టంతో చిన్నప్పటినుంచీ టి.వి, ఫోన్‌‌‌‌లో పాటలు వినేవాడ్ని. దానిద్వారా ఎలా పాడాలి? రాగం ఎలా తీయాలి? అనేది నేర్చుకున్నా. చర్చిలో, స్కూల్‌‌‌‌ కాంపిటీషన్స్‌‌‌‌లో పాడి ప్రైజ్‌‌‌‌లు కూడా గెలుచుకున్నా. నా పాట విన్న చాలామంది ‘బాగా పాడుతున్నావు. టి.వి. కాంపిటీషన్స్‌‌‌‌లో ట్రై చేయి’ అనేవాళ్లు. దాంతో నాక్కూడా రియాలిటీ షోలో పాడాలనిపించింది. అప్పుడే సరిగమప ఆడిషన్‌‌‌‌ గురించిన యాడ్‌‌‌‌ చూశా. దాని వివరాలు తెలుసుకొని ఆడిషన్‌‌‌‌ కోసం హైదరాబాద్‌‌‌‌ వచ్చా. నాలుగు రౌండ్‌‌‌‌ల ఆడిషన్స్‌‌‌‌ తరువాత నన్ను సెలక్ట్‌‌‌‌ చేశారు. నా ఫస్ట్‌‌‌‌ రియాలిటీ షో సరిగమపనే. 

పాట కోసం ఎంత టైం ఇస్తారు?
నేను బిఎస్‌‌‌‌సి నర్సింగ్‌‌‌‌ చదివా. రాయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎయిమ్స్‌‌‌‌లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా జాబ్‌‌‌‌ చేస్తున్నా. రోజుకు ఆరుగంటలు డ్యూటీ ఉంటుంది. మిగిలిన టైంలో పాటలు  ప్రాక్టీస్ చేస్తుంటా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌‌‌‌లో షూటింగ్, జాబ్‌‌‌‌ రెండింటిని మెయింటెన్‌‌‌‌ చేయడం కష్టం అవుతోంది. నా ఫ్యామిలీతో టైం స్పెండ్‌‌‌‌ చేసేందుకు టైం సరిపోవడంలేదు. హైదరాబాద్‌‌‌‌ టు రాయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ తిరుగుతున్నా. నేను ఎక్కడున్నా, నా భార్య ఉషకు టైం ఇవ్వకపోయినా విసుక్కోదు. నన్నూ, పిల్లల్ని బాగా చూసుకుంటుంది. కష్టం అనిపించినా ఓపికగా అన్నీ భరిస్తోంది. నా విషయంలో మా అమ్మలా కేర్ తీసుకుంటుంది. అందుకే ఉషని.. ఉషమ్మా అని పిలుచుకుంటా.

తోటి కంటెస్టెంట్స్‌‌‌‌ ఎలా ఉంటారు?
నా ఫేవరెట్‌‌‌‌ సింగర్ బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాటలు వింటూ పెరిగా. ఆయన్నే నా గురువు అనుకుంటా. నా పాటలో ఉండే ఎనర్జీ ఆయన పాటల నుంచి నేర్చుకున్నా. జడ్జిలందరూ ఆయనలా పాడుతున్నావు అనడం నా అదృష్టంగా భావిస్తా.  నేను సరదా మనిషిని. ఎప్పుడు నవ్వుతూ, అందరినీ నవ్విస్తా. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా. అందుకే స్టేజ్‌‌‌‌ మీద కూడా అందరితో అలానే ఉంటా. 

పాట ఎలా సెలక్ట్ చేసుకుంటారు?  షోలో మీకు టఫ్‌‌‌‌ కాంపిటీషన్ ఎవరు?
పాటల్లో క్లాసికల్, వెస్టర్న్‌‌‌‌, ఫోక్, మెలోడి ఇలా కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఎవరి గొంతుకు ఏ స్టైల్‌‌‌‌ పాట బాగుంటుంది అనేది మెంటార్స్‌‌‌‌ గమనిస్తారు. దానికోసం పది, పదిహేను పాటలు పాడి, రికార్డ్‌‌‌‌ చేసి మెంటార్స్‌‌‌‌కు పంపిస్తాం. వాటిలో మా గొంతుకు ఏ పాట నప్పుతుందంటే ఆ పాటని సెలక్ట్‌‌‌‌ చేసి ప్రాక్టీస్ చేయిస్తారు. నేను ఏ స్టైల్ పాటలైనా పాడగలుగుతా. మెలోడి పాటలంటే ఇష్టం. సెట్‌‌‌‌లో ఎవరికి, ఏ విషయంలో ఇబ్బంది వచ్చినా ఒకరికొకరం సాయం చేసుకుంటాం. నాకు సంగీతం మీద అవగాహన లేదు కదా. ప్రాక్టీస్‌‌‌‌ చేస్తున్నపుడు ఏదైనా తప్పుపాడినా, రాగం, గమకాల్లో ఇబ్బంది వచ్చినా వాళ్లంతా నాకు హెల్ప్‌‌‌‌ చేస్తారు. ఎలా పాడాలో నేర్పిస్తారు. మెంటార్స్‌‌‌‌ కూడా అంతే. వేరే టీం వాళ్లను కూడా సమానంగా చూసుకుంటారు. బాగా సపోర్ట్‌‌‌‌, హెల్ప్‌‌‌‌ చేస్తారు. ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నా. మాలో ప్రతీ కంటెస్టెంట్‌‌‌‌ టఫ్‌‌‌‌గానే ఉంటారు. ఎందుకంటే.. అందరూ పాటకోసం చాలా కష్టపడతారు. ఆడిషన్స్‌‌‌‌కు వచ్చిన కొన్ని వేల మందిని దాటి ఈ స్టేజ్‌‌‌‌వరకు వచ్చారు. ఒకరు పాడిన పాట వాళ్లంత బాగా వేరొకరు పాడటం చాలాకష్టం. అందుకే నా దృష్టిలో అందరు సింగర్స్ బెస్టే. 
                                                                                                                                                                                                                                                                                                                                       :::  కొలనుపాక భరత్​