రాబోయే మూడేళ్లలో ‘డార్విన్ బాక్స్’ ఐపీఓ

రాబోయే మూడేళ్లలో ‘డార్విన్ బాక్స్’ ఐపీఓ

హైదరాబాద్​, వెలుగు: రాబోయే మూడేళ్లలోపు పబ్లిక్​ ఇష్యూకు వెళ్తామని హెచ్​ఆర్​ టెక్​ కంపెనీ డార్విన్ బాక్స్  కో–ఫౌండర్​ చెన్నమనేని రోహిత్​ వెల్లడించారు. హైదరాబాద్​లో సోమవారం తమ కొత్త ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025 నాటికి లాభాల్లోకి వస్తామని అన్నారు. ఇండియా ఆపరేషన్స్​వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. హైదరాబాద్​కు  చెందిన డార్విన్​ బాక్స్​ ఈ ఏడాది జనవరిలో బిలియన్​ డాలర్ల వాల్యుయేషన్​ సాధించి ‘యూనికార్న్​’గా ఎదిగింది. ఈ సంస్థ ప్రమోటర్ల దగ్గర 30 శాతం వాటా ఉంది. మిగతా వాటా టీసీవీ, సేల్స్​ఫోర్స్​ వెంచర్స్​, సికోవియా, లైట్​స్పీడ్, ఎండియా పార్ట్​నర్స్ ​దగ్గర ఉంది.

‘‘హెచ్​ఆర్​ టెక్​ సెగ్మెంట్​లో ఇండియాలోనే మాది మూడో అతిపెద్ద కంపెనీ.   హైదరాబాద్​ ఆఫీసులో ప్రస్తుతం మాకు 700 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏడాదిలోపే వీరి సంఖ్యను వెయ్యికి పెంచుతాం. ఈ ఆఫీసు మాకు గ్లోబల్​ హెడ్​క్వార్టర్​గా పనిచేస్తుంది. మా మార్కెట్​ షేర్​25 శాతం ఉంటుంది.   ఐటీ, ఐటీఈఎస్​, బీఎఫ్​ఎస్​ఐ, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలో మాకు 700 మంది క్లయింట్లు ఉన్నారు. రాబోయే రెండేళ్లలో మరో రూ.400 కోట్ల వరకు ఇన్వెస్ట్​మెంట్లు సేకరించే అవకాశం ఉంది. ఇండియాతోపాటు సింగపూర్​, థాయిలాండ్​, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్​, మలేషియా, గల్ఫ్​ దేశాల్లో సేవలు అందిస్తున్నాం. ఇటీవలే అమెరికాలో అడుగుపెట్టాం. త్వరలో జపాన్​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ మార్కెట్లకు వెళ్తాం” అని ఆయన వివరించారు. 

త్వరలో మరిన్ని మార్కెట్లకు వెళ్తాం: స్కూటర్​ డైరెక్టర్​ పునీత్​ చంద్ర

డార్విన్​ బాక్స్​ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా మేనేజ్డ్​ ఆఫీస్​ స్పేస్​ ఆపరేటర్​ స్కూటర్ ​ డైరెక్టర్​ పునీత్​ చంద్ర మాట్లాడుతూ తాము త్వరలో ముంబై, పుణే, చెన్నై మార్కెట్లకూ విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్​లోని స్కూటర్​ ఆఫీసులో డార్విన్​ బాక్స్​కు 75 లక్షల చదరపు అడుగుల ఆఫీస్​ స్పేస్​ ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్​లో  ఐదు లక్షల మేనేజ్డ్‌​ ఆఫీసు స్పేస్​ను నిర్వహిస్తున్నామని, దేశంలో పది లక్షల చదరపు అడుగుల స్పేస్​ను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దీనిని 2.5 లక్షల చదరపు అడుగులకు పెంచాలనే టార్గెట్​తో పనిచేస్తున్నామని చెప్పారు.  

హైదరాబాద్​తోపాటు ఢిల్లీ, గుర్గావ్​, జైపూర్​ వంటి నగరాల్లో తమకు 11 సెంటర్లు ఉన్నాయని వివరించారు. క్లారానెట్​, గ్రాంట్​ థార్న్​టన్, ఫ్యూచర్​ ఫస్ట్​, క్రెడిట్​సేఫ్​ వంటివి తమ క్లయింట్లను వివరించారు. ‘‘గత క్వార్టర్​ రూ.75 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.100 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తాం. రాబోయే నాలుగేళ్లలో ఐపీఓకు వెళ్లాలనే ఆలోచన కూడా ఉంది. ఈ సెగ్మెంట్​లో దాదాపు ఆరేడు సంస్థలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఆర్థికమాంద్యం ఛాయలు కనిపిస్తున్నా ఇండియాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నిజానికి మనకు లాభం కూడా! ఎందుకంటే ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద కంపెనీలన్నీ ఔట్​సోర్సింగ్​వైపు చూస్తాయి” అని ఆయన వివరించారు.