ఫైనల్‌కు చేరిన కివీస్‌

ఫైనల్‌కు చేరిన కివీస్‌
  • సెమీస్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌పై విక్టరీ
  • వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఓటమికి రివెంజ్‌‌‌‌

అబుదాబి: న్యూజిలాండ్‌‌‌‌ ఇరగదీసింది. ఓటమి ఖాయం అనుకున్న సెమీఫైనల్లో అసాధారణ విజయం సాధించి ఔరా అనిపించింది. వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్లో తమను ఓడించిన ఇంగ్లండ్‌‌‌‌పై ఓ రేంజ్‌‌‌‌లో రివెంజ్‌‌‌‌ తీర్చుకుంటూ టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో తొలిసారి టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఛేజింగ్‌‌‌‌లో 13/2తో కష్టాల్లో పడ్డ టీమ్​ను ఓపెనర్‌‌‌‌ డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (47 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 నాటౌట్‌‌‌‌) వీరోచిత బ్యాటింగ్‌‌‌‌తో గెలిపించి హీరోగా నిలిచాడు. దాంతో, బుధవారం హోరాహోరీగా సాగిన ఫస్ట్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించింది.   మొయిన్‌‌‌‌ అలీ (37 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 నాటౌట్‌‌‌‌),  డేవిడ్‌‌‌‌ మలాన్‌‌‌‌ (41) సత్తాచాటడంతో  ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఇంగ్లండ్‌‌‌‌ 20 ఓవర్లలో 166/4 స్కోరు చేసింది. ఛేజింగ్​లో డారిల్‌‌‌‌తో పాటు కాన్వే (46), నీషమ్‌‌‌‌ (10 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 27) సత్తా చాటడంతో కివీస్‌‌‌‌ 19 ఓవర్లలో 167/5 స్కోరు చేసి గెలిచింది. డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు. 

ఆదుకున్న మిచెల్‌‌‌‌,  కాన్వే 

ఛేజింగ్‌‌‌‌లో కివీస్‌‌‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌ గప్టిల్‌‌‌‌ (4)తో పాటు కెప్టెన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ (5) మూడు ఓవర్లలోపే పెవిలియన్‌‌‌‌ చేరడంతో 13/2తో ఎదురీత మొదలు పెట్టింది. ఇద్దరినీ ఔట్‌‌‌‌ చేసిన క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ (2/36) ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దాంతో, మరో ఓపెనర్‌‌‌‌ డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌, కీపర్‌‌‌‌ కాన్వే జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టారు. దాంతో, సగం ఓవర్లకు  కివీస్‌‌‌‌ 58/2తో నిలిచింది. ఆ తర్వాత ఇద్దరూ గేర్లు మార్చి వరుస బౌండ్రీలతో ఛేజింగ్‌‌‌‌కు ఊపుతెచ్చారు. కానీ, అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసిన లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌  (2/22)వరుస ఓవర్లలో కాన్వే, గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (2)ను ఔట్‌‌‌‌ చేసి మ్యాచ్‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌ చేతుల్లోకి తీసుకెళ్లాడు.

మలుపు తిప్పిన నీషమ్‌‌‌‌

24 బాల్స్‌‌‌‌లో 57 రన్స్‌‌‌‌ అవసరం అవగా కివీస్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌ పెరిగింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్​.. జోర్డాన్‌‌‌‌ (0/31) వేసిన 17వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌ సహా 23 రన్స్‌‌‌‌ రాబట్టి మ్యాచ్‌‌‌‌ను  మలుపు తిప్పాడు.  ఆదిల్‌‌‌‌ (1/39) ఓవర్లో నీషమ్‌‌‌‌, మిచెల్‌‌‌‌ చెరో సిక్స్‌‌‌‌ కొట్టారు. కానీ, లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు నీషమ్‌‌‌‌.. మోర్గాన్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. చివరి 12 బాల్స్‌‌‌‌లో కివీస్‌‌‌‌కు 20 రన్స్‌‌‌‌ అవసరం అవగా  టెన్షన్‌‌‌‌ రెట్టింపైంది. అయితే, వోక్స్‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో మిచెల్‌‌‌‌ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌ బాదేసి మరో 6 బాల్స్​ మిగిలుండగానే  కివీస్‌‌‌‌ను గెలిపించాడు.

రాణించిన అలీ, మలాన్‌‌‌‌

ఇంగ్లండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో మొయిన్‌‌‌‌ అలీ, డేవిడ్‌‌‌‌ మలాన్‌‌‌‌ అదరగొట్టారు. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆ జట్టు స్టార్టింగ్‌‌‌‌లో కాస్త జాగ్రత్తగా ఆడింది. ఫామ్​లో ఉన్న బట్లర్‌‌‌‌ (29) ఆకట్టుకున్నా... మరో ఓపెనర్​  బెయిర్‌‌‌‌స్టో( 13) ఫెయిలయ్యాడు.  మిల్నే (1/31) వేసిన ఆరో ఓవర్లో విలియమ్సన్‌‌‌‌ పట్టిన డైవింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు ఔటవగా పవర్‌‌‌‌ప్లేలో ఇంగ్లండ్‌‌‌‌ 40/1 స్కోరు చేసింది. తొమ్మిదో ఓవర్లో బట్లర్‌‌‌‌ను ఎల్బీ చేసిన ఇష్‌‌‌‌ సోధీ (1/32) ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. కివీస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చూస్తే ఇంగ్లండ్‌‌‌‌ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ,మలాన్‌‌‌‌, మొయిన్‌‌‌‌ అలీ మూడో వికెట్​కు 63 రన్స్​ జోడించి ఇన్నింగ్స్​ను చక్కదిద్దారు.  11వ ఓవర్లో మలాన్‌‌‌‌ 2ఫోర్లు కొట్టగా.. అలీ కూడా వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టడంతో 14 ఓవర్లలో స్కోరు వంద దాటింది.  సౌథీ వేసిన 16వ ఓవర్లో మలాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో ఫస్ట్ సిక్స్‌‌‌‌ రాబట్టినా.. తర్వాతి బాల్‌‌‌‌కే ఔటయ్యాడు. అయితే, అప్పటిదాకా జాగ్రత్తగా ఆడిన అలీ ఒక్కసారిగా స్పీడు పెంచాడు. సోధీ, మిల్నే బౌలింగ్‌‌‌‌లో  రెండు సిక్సర్లు బాదాడు.  లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ (17)  కూడా 6, 4  కొట్టడంతో స్కోరు 150 దాటింది. లాస్ట్‌‌‌‌ ఓవర్లో లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ ఔటైనా ఫోర్‌‌‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అలీ టీమ్‌‌‌‌కు మంచి స్కోరు అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌‌‌: 20 ఓవర్లలో 166/4 (మొయిన్‌‌‌‌ 51 నాటౌట్‌‌‌‌, మలాన్‌‌‌‌ 41, సౌథీ 1/24).

న్యూజిలాండ్‌‌‌‌: 19 ఓవర్లలో 167/5 (మిచెల్‌‌‌‌ 72 నాటౌట్‌‌‌‌, కాన్వే 46, లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ 2/22)