Telangana Tour : ఈ సెలవుల్లో రాములోరు నడిచిన ఊరు చూసొద్దామా..

Telangana Tour : ఈ సెలవుల్లో రాములోరు నడిచిన ఊరు చూసొద్దామా..

పురాణాలు, ఇతిహాసాలు చదివినప్పుడల్లా... అందులో చెప్పిన ప్రాంతాల గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. అలానే రామాయణం చదివినా, విన్నా... రాముడు నడయాడిన నేలని చూసి రావాలనిపిస్తుంది. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలకు నిలయమైన ప్లేస్ ల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఒకటి. ఇక్కడికి వెళ్తే... గోదావరి ఒడ్డున వెలసిన రాములోరిని దర్శించుకొని దీవెనలు పొందొచ్చు.

సీతారాములు నివసించిన పర్ణశాలని చూడొచ్చు. అంతేకాదు కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అడవి జంతువులు, పక్షులని చూస్తూ సేదతీరొచ్చు. దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చూసి రావొచ్చు.

మన రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో భద్రాచల ఆలయాన్ని భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న కట్టించాడు. ఇతనిది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. గోల్కొండ తానీషా కాలంలో పాల్వంచ తహసీల్దారుగా ఉన్న ఇతను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సొమ్ముతో ఆలయం కట్టించాడు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు నిత్యకల్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి రోజు ఈ ప్రాంతమంతా రామనామ స్మరణతో మారుమోగుతుంది. 

ఈ ఊరికి 'భద్రాచలం' అనే పేరు రావడం వెనుక ఓ కథ ఉంది. పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరాముడి దర్శనం కోసం తపస్సు చేసి 'స్వామి నన్ను కొండగా చేసి, మీరు ఇక్కడే కొలువుదీరండి' అని వరం కోరాడట. దాంతో రాముడు.. సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలిశాడని చెప్తారు. భద్రుడి పేరు మీద ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'భద్రాచలం'
అని పిలుస్తున్నారు.

టైమింగ్స్..

రోజూ ఉదయం 4:30 గంటలకు గుడి తలుపులు తెరుస్తారు. రాత్రి 9 గంటలకు గుడి మూసేస్తారు.

పర్ణశాల..

రామాయణంలో ఈ ప్లేస్ కి చాలా ప్రాధాన్యం ఉంది. సీతారాములు వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసం చేసిన చోటు ఇది. అప్పుడు గోదా వరి నదీ తీరాన ఏర్పాటుచేసుకున్న 'పర్ణశాల' అనే కుటీరంలో ఉన్నారనేది స్థల పురాణం. మారీచుడు అనే రాక్షసుడు బంగారు జింక రూపంలో వచ్చి, సీతాదేవి కంటపడిన చోటు ఇదే. పర్ణశాలలోని సీతారామ, లక్ష్మణ, రావణాసురుడి బొమ్మలు అలనాటి దృశ్యాలను కళ్లముందు నిలిపేలా ఉంటాయి. పర్ణశాలకి దగ్గర్లోని వాగులో సీతాదేవి స్నానమాచరించిందట. దాంతో ఆ వాగుకి 'సీతవాగు' అనే పేరొచ్చింది. 

ఆ వాగు పక్కనే ఉన్న 'రాధ గుట్ట' మీద సీత తన నార చీరలు ఆరేసుకుందని, అందుకే ఆ ప్రాంతాన్ని 'నార చీర గుర్తుల స్థలం' గా పిలుస్తారు. అంతేకాదు, పసుపు, కుంకుమ కోసం సీతాదేవి ఉపయోగించిన రాళ్లుగా భావించేవాటిని కూడా ఇక్కడ చూడొచ్చు.

కిన్నెరసాని శాంక్చురీ..

కిన్నెరసాని నది ఈ శాంక్చురీని రెండు భాగాలుగా విడగొట్టి, చివరకు గోదావరిలో కలుస్తుంది. అందుకే ఆ నది పేరు మీద దీన్ని 'కిన్నెరసాని శాంక్చురి' అని పిలుస్తారు. 635 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన ఈ శాంక్చురీ... ప్రకృతి ఒడిలో సేదతీరాలి అనుకునేవాళ్లకు, నేచర్ ఫొటోగ్రపీని ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతుంది. 

టికెట్ ధర..

ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు, హైనా వంటి జంతువులతో పాటు రకరకాల పక్షులు కనిపిస్తాయి. తెడ్డులాంటి పొడవైన ముక్కు ఉన్న పక్షుల్ని ఇక్కడ చూడొచ్చు. ఇవే కాకుండా జింకల పార్క్, అడవిబర్రె బొమ్మలు మరో అట్రాక్షన్. శాంక్చురి మధ్యలో ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ బోటు షికారు కూడా చేయొచ్చు. ఎంట్రీ టికెట్ ధర పిల్లలకు రూ. 10. పెద్దవాళ్లకు రూ.20. 

పెద్దమ్మతల్లి ఆలయం..

పాల్వంచ మండలంలోని జగన్నాధపురం ఊళ్లో ఉంది ఈ గుడి. ఈ ఆలయం వెనక ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పెద్ద చెట్లతో అడవిని తలపించేది. ఊరికి దగ్గర్లోని చింతచెట్టు కింద ఒక పులి ఉండేదట. మనుషులు దాని ముందు నుంచి వెళ్లినా కూడా వాళ్లకు ఏ హానీ చేసేది కాదట. దాంతో ఊరివాళ్లంతా ఆ పులిని పెద్దమ్మతల్లిగా భావించి గుడి కట్టించారు. టైమింగ్స్: ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు. 

ఇలా వెళ్లాలి..

హైదరాబాద్ నుంచి 310 కిలోమీటర్ల దూరంలో ఉంది భద్రాద్రి కొత్తగూడెం. రైల్లో కూడా వెళ్లొచ్చు. భద్రాద్రి నుంచి 32 కిలోమీటర్లు జర్నీ చేస్తే పర్ణశాల చేరుకోవచ్చు.
ఇక్కడికి పడవలో కూడా వెళ్లొచ్చు. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురి వెళ్లేందుకు పాల్వంచ నుంచి 12 కిలోమీటర్లు జర్నీ చేయాలి. పాల్వంచ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో పెద్దమ్మతల్లి గుడి ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం వెళ్తే.. దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూడొచ్చు. గోదావరి నీళ్లను దుమ్ముగూడెం చెరువు మీదుగా కృష్ణా నది బేస్కి మళ్లించేందుకు ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు. అంతేకాదు పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. ఇక్కడ బొగ్గు నుంచి కరెంట్ తయారుచేస్తారు.