దసరా మూడో రోజు ముహూర్తం , మంత్రాలు, పూజల వివరాలు ఇలా..

దసరా మూడో రోజు  ముహూర్తం , మంత్రాలు, పూజల వివరాలు ఇలా..

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం ఒక్కో రూపాన్ని ధరించి ఒక్కో అసురుడిని సంహరిస్తూ వచ్చింది. అమ్మవారు ధరించిన ఆ రూపాలు శరన్నవ రాత్రులలో నవదుర్గా రూపాలుగా పూజలు అందుకుంటున్నాయి.నవరాత్రులలో మొదటిరోజున శైలపుత్రి గాను ... రెండవరోజున బ్రహ్మచారిణి గాను అలంకరించబడి పూజలు అందుకున్న అమ్మవారు, మూడవరోజున 'చంద్రఘంటాదేవి'గా అలంకరించబడి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. శిరస్సుపై చంద్రుడిని ధరించిన కారణంగా ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవిగా కొలుస్తుంటారు.

నవరాత్రుల్లో మూడో రోజు- చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే ఈ రంగు ఆటంకాలను తొలగించి.. విజయాలను చేకూరుస్తుంది. మూడవ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ అక్టోబర్‌17 మంగళవారం రోజున చంద్రఘంటా పూజ చేస్తారు.

బ్రహ్మ ముహూర్తం 4:42 AM నుండి 5:33 AM వరకు 
అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:29 వరకు 
ప్రాతః సంధ్య 5:08 AM మరియు 6:23 AM మధ్య 
అమృత్ కలాం 11:23 AM నుండి 1:02 PM వరకు 

చంద్రఘంటా దుర్గా,  దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.

తన భక్తులను రక్షించడం కోసం ఈ అమ్మవారు పులి వాహనాన్ని అధిష్టించి తిరుగుతూ వుంటుంది. చంద్రఘంటాదేవికి కొబ్బరితో కలిపి వండిన అన్నమంటే ఇష్టమట. అందువలన ఆ తల్లికి దానిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఎందుకంటే పూర్ణఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని పెడతారు. దీంతో పాటు కొబ్బెర బెల్లం కలిపి కూడా పెట్టవచ్చు. 

ఈ అమ్మవారిని దర్శించడం వలన ... పూజించడం వలన భూతప్రేత పిశాచాది భయాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.భూత ప్రేత పిశాచాది భయాలు కొంతమందికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. నిజానికి ఈ సమస్య ఇతరులకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. దాని బారి నుంచి బయటపడటం కష్టంగా అనిపిస్తుంది. ఈ సమస్య ఔషధ పరమైన వైద్యం వలన తొలగిపోయేది కాదు కాబట్టి, బాధితులను ఆయా క్షేత్రాలకి తీసుకు వెళ్లడం ... అక్కడి దైవాలకు వివిధ రకాల మొక్కులు మొక్కుకోవడం చేస్తుంటారు. ఈ రకమైన సమస్య నుంచి బయటపడటానికీ, మున్ముందు ఇలాంటి భయాలు ఎదురుకాకుండా ఉండటానికి చంద్రఘంటాదేవిని పూజించాలనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన భూతప్రేత పిశాచాది భయాలు ... బాధలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.


పురాణ గాథ

శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న  తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన  మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత,  ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి  వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.  అప్పుడు  అమ్మవారు  చంద్రఘంటాదేవి  రూపంలో శివునకు కనిపించి,  తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం  మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని  వేషంలో,  లెక్కలేనన్ని  నగలతో తయారవుతాడు.   అప్పుడు  ఆమె కుటుంబసభ్యులు,  స్నేహితులు, బంధువులూ భయం  పోయి  శివుణ్ణి  వివాహానికి  ఆహ్వానిస్తారు.  ఆ  తరువాత  శివ,పార్వతులు  వివాహం చేసుకుంటారు.  అలా  ప్రజల  భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.

శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.

చంద్రఘంటా దుర్గా దేవి అవతారం (రూప వర్ణన)

చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో  త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో  ఖడ్గం,  ఇంకో  చేతిలో కమండలం  ఉంటాయి. కుడి హస్తం  మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ, సింహం  మీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు.  అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.

పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు  ఆ గంట నినాదానికే రాక్షసులు పారిపోయారని   దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ గంట నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.

పార్వతీ దేవీ పరమేశ్వరునికి ధర్మపత్ని. వివాహం తర్వాత చంద్రుడు చేసిన నెలవంకను శిరస్సులో ధరిస్తాడు.ఈ కారణంగానే ఆమెను చంద్రఘంటా అని పిలుస్తారు. ఆమెను పూజించడం ద్వారా మానవ జీవితంలో సమస్యలు వుండవు. ఆమె పది చేతులు, మూడు కళ్ళు కలిగి ఉంటుంది. ఆమె నుదిటిపై శివుడి నెలవంక చంద్రుడు ఉంది.
ఆమె బంగారు రంగు కలిగి యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె గంటలను మాలగా ధరిస్తుంది. ఇది రాక్షసులను భయపెడుతుంది అమ్మవారి గంటల శబ్ధం రాక్షసులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె పులిని నడుపుతూ తన భక్తులను రక్షిస్తుంది. ఆమెకు నచ్చిన పుష్పం కమలం. నచ్చిన రంగు ఎరుపు. అలాగే ''ఓం దేవి చంద్రఘంటాయై నమః'' అనే మంత్రాన్ని స్తుతించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా చంద్ర, శుక్ర గ్రహ దోషాలు తొలగిపోతాయి.

సుఖశాంతులను ప్రసాదించే ఆమె తలపై సగం చంద్రునితో అలంకృతమై వుంటుంది. ఆమెను నవరాత్రుల్లో మూడో రోజున పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. పాలు ఇంకా పాల ఉత్పత్తులతో తయారయ్యే ఆహార పదార్థాలను ఆమెకు నైవేద్యంగా సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ సంవత్సరం (2023) తృతీయ తిథి మంగళవారం ( అక్టోబర్ 17) పూట నవరాత్రుల్లో భాగమైన మూడో రోజు రావడంతో శివునిని కూడా ఆ రోజు పూజించిన వారిక సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు