
- నేడు మాంసం, మద్యం దుకాణాలు బంద్ కావడంతో బుధవారమే జోరుగా కొనుగోళ్లు
- పండుగకు ఒక్క రోజు ముందే రూ.380 కోట్ల లిక్కర్ సేల్స్!
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో దసరా అతిపెద్ద పండుగ. మెజార్టీ జనం.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ముక్క, సుక్కతో దావత్ లు చేసుకోవడం ఆనవాయితీ. కానీ, ఈ సారి గాంధీ జయంతి రోజే దసరా రావడం, అక్టోబర్ 2న జంతుబలులు, మద్యం విక్రయాలపై నిషేధం ఉండడంతో బుధవారమే చాలా ప్రాంతాల్లో దసరా సందడి మొదలైంది. గురువారం మాంసం, మద్యం దుకాణాలు బంద్ కానుండడంతో ఒకరోజు ముందే జనం లిక్కర్, చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కట్టారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా మటన్, చికెన్, వైన్స్ షాపులు కిటకిటలాడాయి. గ్రామాల్లోనైతే ఐదు, పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి యాటలు కొనుగోలు చేసి బుధవారం రాత్రి పోగులేసుకున్నారు. గురువారం మాంసం, మద్యం ముట్టకూడదనుకున్న వాళ్లు బుధవారమే పండుగ జరుపుకున్నారు.
జోరుగా మద్యం అమ్మకాలు..
దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు ఊపందుకు న్నాయి. పండుగకు ముందు నుంచే వైన్ షాపుల్లో, బార్లలో భారీ విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ నెల మొత్తం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. ఈ నెలలో మొత్తం రూ.3,048.51 కోట్ల విలువైన మద్యం విక్ర యాలు జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇందులో 29.92 లక్షల కేసుల లిక్కర్, 36.48 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో మద్యం సేల్స్ దాదాపు రూ.210 కోట్లు పెరిగింది. దసరాకు రెండు రోజుల ముందు సెప్టెంబర్ 30న రూ. 333 కోట్ల విలువైన మద్యం విక్రయించారు.
ఇందులో 3 లక్షల 21 వేల లిక్కర్ కేసులు, 3 లక్షల 24 వేల బీర్ కేసులు ఉన్నాయి. అక్టోబర్ 1 బుధవారం దాదాపు రూ.380 కోట్లపైనే అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ ఉండనుండటంతో గ్రామాల్లో ముందే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. మద్యం వినియోగం పెరగడంతో వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మద్యం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాయి.
ముఖ్యంగా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్ స్టాక్‌ను భారీగా నిల్వ చేసుకున్నాయి. వరుసగా పండుగ సెలవులు ఉండటంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లోనూ సేల్స్ ఎక్కువగా ఉంటాయని వైన్స్‌లు పెద్ద ఎత్తన మద్యాన్ని లిప్ట్ చేశాయి.