ఆక్షరాల్ని ఆయుధాల్లా ప్రయోగించిన పోరాట యోధుడు

ఆక్షరాల్ని ఆయుధాల్లా ప్రయోగించిన పోరాట యోధుడు

నిజాం పాలనలో తెలంగాణ జనం కన్నీళ్లను కవిత్వం రూపంలో అగ్నిధారగా కురిపించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్నే ఆయుధంగా మార్చి తెలంగాణ ఉద్యమంలో ఉపయోగించారు దాశరథి. 1925 జులై 22న నాటి వరంగల్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడురులో కృష్ణమాచార్యులు పుట్టారు. ఆయన బాల్యం మధిరలో గడిచింది. చిన్నతనంలోనే వేదాలు, ఇతిహాసాల్ని ఔపోసన పట్టారు. భగవద్గీత శ్లోకాలను కంఠతా పట్టారు. పూజ సమయంలో సంస్కృతంలోనే మాట్లాడాలని తండ్రి షరతు పెట్టారు. ఈ సాధన సాయంతో దాశరథి చిన్నతనంలోనే ఆశువుగా పద్యాలు అల్లడం నేర్చుకున్నారు. ఖమ్మంలో మెట్రిక్యులేషన్, భోపాల్ లో ఇంటర్మీడియట్ చదివాక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో బీఏ పట్టా తీసుకున్నారు. సంస్కృతంతో పాటు ఇంగ్లిష్, ఉర్దూ, పార్సీ భాషలపై కృష్ణమాచార్యకి మంచి పట్టుంది.
హైదరాబాద్ లో చదువుతున్న కాలంలోనే దాశరథి ఆంధ్రమహాసభలో చేరారు. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఊరూరూ తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఆంధ్రమహాసభ కమ్యూనిస్ట్ పార్టీగా మారాక కొంతకాలం అందులోనే ఉన్నారు. అయితే రెండో ప్రపంచయుద్ద సమయంలో ఆ పార్టీ వైఖరి ఆయనకు నచ్చలేదు. దీంతో పార్టీ నుంచి బయటకొచ్చి రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. అటు దొరల అరాచకత్వం, ఇటు నిజాం నిరంకుశత్వంలో పేదల కన్నీళ్లు చూసి దాశరథి విప్లవకవిగా మారారు. ఆక్షరాల్ని ఆయుధాల్లా ప్రయోగించారు. 

1947లో దాశరథిని అరెస్ట్ చేసిన నిజాం సర్కార్ వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచింది. అక్కడి నుంచి నిజామాబాద్ కు తరలించింది. దశారథి, వట్టికోట ఆళ్వారుస్వామితో పాటు 150 మంది ఉద్యమకారులంతా అదే జైలులో శిక్ష అనుభవించారు. ‘‘ఓ నిజాము పిశాచమా.. కానరాడు నిను బోలిన రాజు మాకెన్నెడేని, తీగలను తెంపి అగ్నిలోన దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అంటూ జైలులోనూ దాశరథి కవిత్వంతో విరుచుకుపడ్డారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినాదాలు చేశారు. దాశరథి కవిత్వం చెబుతుంటే వాటిని వట్టికోట బొగ్గుముక్కతో జైలుగోడలపై రాసేవారు. ఈ జైలు కవిత్వాన్నే అగ్నిధార అనే సంకలనంగా ప్రచురించారు. ఆళ్వారుస్వామి ఆ పద్యాలను కంఠతా పట్టి బయటికొచ్చాక ప్రచురించడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే దాశరథి అగ్నిధారను వట్టికోటకే అంకితమిచ్చారు.

అగ్నిధార అచ్చుకాకముందే అందులోని పద్యాలు తెలంగాణ అంతా మారుమోగాయి. 1949లో ఇల్లందులో జరిగిన సభలో దాశరథికి మహాకవి అన్న బిరుదును ప్రకటించారు. మహాంద్రోదయం, రుద్రవీణ, మార్పు నా తీర్పు, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, కవితా పుష్పకం, తిమిరంతో సమరం లాంటి కవితా సంపుటాలతో పాటు అనేక రచనలు చేశారు. యాత్రాస్మృతి పేరుతో ఆత్మకథ రాశారు. కవితా పుష్పకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డ్ వస్తే, తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ప్రకటించారు. అరబ్బీ సాహిత్య ప్రక్రియ అయిన రుబాయిని దాశరథి తెలుగులో ప్రవేశపెట్టారు. అట్లనే గజల్ సాహిత్య రూపాన్ని తెలుగులో పరిచయం చేశారు. గజల్ జీవలక్షణాన్ని కాపాడుతూ మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించారు.

దాశరథి సినిమా సాహిత్యాన్ని కూడా రాశారు. 1961లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఇద్దరు మిత్రులు సినిమాతో గీతరచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఖుషీఖుషీగా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ అనే పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న పదాలతో, స్వచ్ఛమైన తెలుగులో ఆయన రాసిన ఎన్నో పాటలు క్లాసిక్స్ గా నిలిచాయి. గోరొంక గూటికే చేరావో చిలకా, గోదారి గట్టుంది, రారా కృష్ణయ్యా, నను పాలింపగ నడచి వచ్చితివా లాంటి అద్భుత గీతాలు దాశరథి రాసినవే. 1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపుర్ణ బిరుదుతో దాశరథిని సత్కరించింది. 1976లో ఆగ్రా విశ్వవిద్యాలయం, 1981లో ఎస్వీ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 

పోరాటయోధుడిగా, కవిగా ప్రజల కోసమే తపించిన దాశరథి ఏనాడూ డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవాలనే ఆలోచన చేయలేదు. పేదరికంలోనే జీవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆస్థానకవిగా ఉన్న దాశరథిని 1983లో అవమానకంగా తొలగించారు. 1987 నవంబర్ 5న దాశరథి కన్నుమూశారు. ఆ చల్లని సముద్ర గర్భం అంటూ దాశరథి రాసిన పాట మానవజాతి చరిత్రను కళ్లకుకట్టింది. విశ్వానికే సందేశంలా నిలిచింది. ఈ దానవలోకంలో మానవులని పిలవదగిన జాతి ఎప్పటికైనా పుడుతుందన్న ఆశతీరకుండానే దాశరథి ఈ లోకానికి దూరంగా వెళ్లిపోయారు. అందుకే ఆయనకు ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టాలన్న ఆలోచన కూడా మన పాలకజాతికి రాలేదు.