డేటా చోరీ కాల్ సెంటర్ గుట్టురట్టు.. సర్వర్, మోడెం, హార్డ్ డిస్కులు స్వాధీనం

డేటా చోరీ కాల్ సెంటర్ గుట్టురట్టు.. సర్వర్, మోడెం, హార్డ్ డిస్కులు స్వాధీనం
  • ఫరీదాబాద్  నిందితుడు ఇచ్చిన సమాచారంతో సిట్  సోదాలు

హైదరాబాద్, వెలుగు : కస్టమర్ల డేటా చోరీ కేసులో హైదరాబాద్ డేటా కాల్ సెంటర్ గుట్టు రట్టయింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ లో డెలెన్  హెల్త్ కేర్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న కాల్ సెంటర్ లో సైబరాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి సోదాలు చేశారు.15 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ లోని కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, 23 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వారిని సైబరాబాద్ కమిషనరేట్ లోని సిట్ ఆఫీసుకు తరలించారు.

సర్వర్, మోడెం, హార్డ్ డిస్క్ లను కూడా సీజ్  చేశారు. డేటాను రికవరీ చేస్తున్నారు. ప్రధానంగా సౌత్ ఇండియా వారి డేటాను హ్యాక్  చేసేందుకే ఈ కాల్ సెంటర్  నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏం యాక్టివిటీస్  నిర్వహించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 83.7 కోట్ల మంది డేటాను చోరీ చేసిన రెండు గ్యాంగులను సైబరాబాద్  పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 16.7 కోట్ల మంది పర్సనల్  డేటాను దొంగిలించిన కేసులో ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు.

వారిచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ కు చెందిన వినయ్  భరద్వాజ్ అనే నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. వినయ్  వద్ద 66.7 కోట్ల మంది డేటాను గుర్తించారు. వినయ్  ఇచ్చిన సమాచారం ఆధారంగా మంగళవారం పేట్ బషీరాబాద్ లోని డెలెన్  హెల్త్ కేర్  కాల్ సెంటర్ వివరాలు రాబట్టారు.

మూడు నెలల కిందట ఆఫీసు ఓపెన్

మూడు నెలల క్రితం డెలెన్  కాల్  సెంటర్  ఆఫీసును ఓపెన్ చేశారు. అంతకుముందు అదే రూంలో డెలెన్ హెల్త్ కేర్  డయాగ్నోసిస్  సెంటర్ ఉండేది. దానిని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. కానీ బోర్డులు మాత్రం అలాగే ఉండిపోయాయి. నిందితులు అవే బోర్డులను ఉపయోగించి డేటా దొంగిలించి ఆఫీసు నడుపుతున్నారు. ఈ విషయం డెలెన్ నిర్వాహకులకు తెలియదు.