పార్లమెంట్‎లో ఆపరేషన్ సిందూర్‎పై చర్చకు డేట్, టైమ్ ఫిక్స్.. ఇక మాటల యుద్ధమే..!

పార్లమెంట్‎లో ఆపరేషన్ సిందూర్‎పై చర్చకు డేట్, టైమ్ ఫిక్స్.. ఇక మాటల యుద్ధమే..!

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‎పై చర్చకు డేట్, టైమ్ ఫిక్స్ అయ్యింది. 2025, జూలై 28న లోక్ సభ, 29వ తేదీన రాజ్య సభలో ఆపరేషన్ సిందూర్‎పై చర్చ నిర్వహించనున్నారు. బుధవారం (జూలై 23) జరిగిన రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం తర్వాత పై తేదీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు జాతీయ వార్త సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. పార్లమెంట్‏లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‎పై చర్చ కోసం లోక్ సభకు 16 గంటలు, రాజ్యసభకు 9 గంటల సమయం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. 

ALSO READ | ధన్ఖడ్ రాజీనామా రాజకీయ సంచలనం

కాగా, పహల్గాం టెర్రర్ ఎటాక్, దీనికి కౌంటర్ గా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలపై పార్లమెంట్లో  చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ చర్చలో ప్రధాని మోడీ పాల్గొని సమాధానం చెప్పాలని కోరుతున్నాయి అపొజిషన్ పార్టీలు. వర్షకాల పార్లమెంట్ సమావేశాలు మొదలై మూడు రోజులు అవుతున్నప్పటికీ పై అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో సభ సజావుగా సాగడం లేదు.

మూడు రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాల డిమాండ్‎కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‎పై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. జూలై 24 నుంచి ప్రధాని మోడీ నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయన తిరిగొచ్చిన తర్వాత ఈ అంశాలపై చర్చ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తుటాలు పేలనున్నట్లు తెలుస్తోంది.