
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భారతదేశ చరిత్రలో రాజీనామా చేసిన మొదటి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. అయితే, గతంలో రాష్ట్రపతిగా ఎన్నికవడంతో మరో ఇద్దరు ఉప రాష్ట్రపతులు ఆర్. వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ తమ పదవులకు రాజీనామా చేశారు.
ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం అసాధారణంగానే పరిగణించాలి. ఆయనకు అలాంటి పదవీ సంక్షోభం వస్తుందని ఎవరికీ తెలియదు. ఆయన రాజీనామా విషయాన్ని పైకి చూస్తే ధన్ఖడ్ కోసం జరుగుతున్న ప్రతి అంశం సజావుగానే కనిపిస్తుంది. మొన్న ధన్ఖడ్ రాజీనామా చేసిన వెంటనే రాజకీయ వర్గాల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయి.
జగదీప్ ధన్ ఖడ్ తన పదవికి ఆరోగ్య కారణాల వల్లనే నిజంగా రాజీనామా చేశారని నమ్మడానికి సహేతుకమైన కారణం కనిపించడం లేదు. కానీ, నిన్నటి నుంచి రహస్యాలు కొద్దికొద్దిగా, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగదీప్ ధన్‌ఖడ్‌కు ఎన్నో రాజకీయ విభేదాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కువగా ధన్ఖడ్ వ్యక్తిగతమైనవి.
జగదీప్ ధన్‌ఖడ్‌కు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర లేదు. 1989–-1991 మధ్య ఆయన జనతా పార్టీ ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత, 2019లో బీజేపీ ఆయనను బెంగాల్ గవర్నర్‌గా నియమించే వరకు ఆయనకు ఎలాంటి పదవి లేదు. ఆ తర్వాత 2022లో జగదీప్ ధన్ఖడ్ ఉప రాష్ట్రపతి అయ్యారు. ధన్ఖడ్ తిరుగుబాటుదారుడిగా మారతాడని ఆయన కెరీర్ ఏమాత్రం చెప్పడంలేదు. బెంగాల్ గవర్నర్‌గా ఆయన చేసిన పని పట్ల బీజేపీ సంతృప్తి చెందింది. అందువలనే ఆయనను ఉప
రాష్ట్రపతిని చేసింది.
ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు?
రాజ్యసభ ఎలా నిర్వహించాలనే దానిపై ధన్ఖడ్ బీజేపీ అధినాయకత్వం మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని ఇప్పుడు వెలువడుతున్న సమాచారం చెబుతోంది. ధన్ఖడ్ తరచుగా న్యాయవ్యవస్థపై దాడి చేయడం పట్ల బీజేపీ అసంతృప్తిగా ఉందని కూడా గుసగుసలు వినిపించాయి. కొన్ని అంశాలపై ధన్‌ఖడ్‌ను బీజేపీ నియంత్రించలేకపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్ఖడ్ రాజీనామా తర్వాత, వివిధ పార్లమెంటరీ పనులపై కొన్ని విభేదాలు బయటకు వచ్చాయి.
కానీ, సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే ఆ విభేదాలు రాజ్యాంగంపై పెద్ద తేడాలు కావు లేదా తీవ్రమైనవి కావు. ధన్ఖడ్, బీజేపీ నాయకుల మధ్య ఆగ్రహంతో ఫోన్ కాల్స్ జరిగినట్టు కూడా సమాచారం ఉంది. ఈ సంఘటనలు, ఈ వివాదాలను పెద్దవిగా చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలని బీజేపీ నాయకత్వం స్పష్టంగా సూచించి ఉండొచ్చు. ఆయనను ఇంకా పదవిలో కొనసాగించాలని బీజేపీ భావించి ఉండకపోవచ్చు. అయితే, ధన్ఖడ్ ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ద్వారా పోరాడితే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలిగించేవాడు.
గతంలో ఇలాంటి పరిస్థితులు
1984 నుంచి 1989 వరకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌తో ఆయన తీవ్ర వివాదాన్ని ఎదుర్కొన్నారు. రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలని జైల్‌సింగ్ కోరుకున్నారు. జైల్‌సింగ్ వైఖరి వివాదాస్పదంగా మారింది. కానీ, జైల్‌సింగ్ పదవీకాలం ముగిసిపోయింది.
ఇంతకుముందు మనదేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి మధ్య ప్రభుత్వ నిర్ణయాల పట్ల అనేక ఉద్రిక్తతలు ఉండేవి. కానీ, ఉప రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ ఎటువంటి ఉద్రిక్తత లేదు. పదవిలో ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించనందుకు, ప్రభుత్వాన్ని గొప్ప ఇబ్బంది నుంచి కాపాడినందుకు ధన్‌ఖడ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
ప్రధాని వ్యాఖ్య
జగదీప్ ధన్ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక చిన్న వ్యాఖ్య చేశారు. ‘దేశానికి సేవచేసే అవకాశాలు లభించడం ఉప రాష్ట్రపతి అదృష్టం. ఆయన ఇప్పుడు తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను’ అని మోదీ ప్రకటించారు. ఆ ప్రకటన మోదీ కారణంగానే ధన్ఖడ్ గవర్నర్, ఉప రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేసింది. మోదీ ప్రకటనలో ప్రశంసల స్థానంలో తీవ్రమైన వ్యంగ్య సూచనలు ఉన్నట్లు అనిపిస్తున్నది.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. దీంతో ఓ అధ్యాయం ముగిసింది. రాజ్యాంగం ప్రకారం వీలైనంత త్వరగా ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. కానీ, దీనికి కాలపరిమితి నిర్ణయించలేదు.
రాజకీయాలు శూన్యతను సహించవు. ఉప రాష్ట్రపతి పదవికి ఇప్పటికే చాలామంది పోటీదారులు ఉన్నారు. ఏదైనా రాజకీయ పదవి ఖాళీ అయిన వెంటనే ఆ తరువాత నిమిషంలోనే హడావుడి మొదలవుతుంది. ఒక పెద్ద రాజకీయ నాయకుడు రాజీనామా చేసినప్పుడు లేదా మరణించినప్పుడు, ఆ పదవి కోరుకునే ఇతరులు సమయం వృథా చేయరు. ఇప్పుడు ఎవరూ ధన్ఖడ్ గురించి ఆలోచించడం లేదు. ధన్‌ఖడ్‌ను గవర్నర్‌గా, ఉప రాష్ట్రపతిగా తామే చేసినట్టు బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.
సహజంగానే బీజేపీ ఆయన నుంచి విధేయత, విచక్షణను ఆశించింది. ధన్ఖడ్ తమను నిరాశపరిచినందుకు బీజేపీ ఖచ్చితంగా నిరాశచెందింది. అన్ని పార్టీలు విధేయతను ఆశించడం సహజం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో సమస్య ఎంత త్వరగా తొలగిపోతే ఏ ప్రభుత్వానికైనా అంత మంచిది. సమస్య అలాగే కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.
ఏం తప్పు జరిగింది?
సాధారణంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి హుందాగా వ్యవహరిస్తూ.. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. వారి అధికారాలకు పరిమితులు ఉంటాయి. రాజ్యాంగపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా మాట్లాడటం ప్రారంభించినప్పుడు వారు వివాదాస్పదంగా మారతారు. జగదీప్ ధన్ఖడ్ కూడా ఎక్కువగానే బహిరంగంగా వ్యాఖ్యలు చేసేవారు.
కేంద్ర ప్రభుత్వం ధన్ఖడ్ బహిరంగ ప్రకటనలు చేయకుండా ఆయనను నిరోధించడానికి ప్రయత్నించింది. కానీ, ధన్ఖడ్ తన వైఖరిని మార్చుకోలేదు. న్యాయవ్యవస్థపై తరచుగా దాడులు ప్రభుత్వానికి సమస్యలను సృష్టించాయి. ఇటీవల ధన్ఖడ్ వివిధ అంశాలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని సైతం సంప్రదించలేదు.
ఇది మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. ఈ సమస్యను వెంటనే కట్టడి చేయాలని ప్రభుత్వం భావించినట్లుంది. ఫలితంగానే ధన్ఖడ్ రాజీనామా చేయాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. చిన్న తేడాలు అసాధ్యమైన సమస్యలుగా మారాయని చెప్పొచ్చు.
రాజకీయ తుపాను
జగదీప్ ధన్ఖడ్ విషయంలో బీజేపీ చాలా వేగంగా వ్యవహరించింది. ధన్ఖడ్ కూడా సరైన పని చేశారు. ఒకవేళ ఆయన పదవిలో కొనసాగితే అవమానాన్ని ఎదుర్కొనేవాడు. ఈనేపథ్యంలో ధన్ఖడ్ రాజీనామా నిర్ణయం సరైనదే. బీజేపీ మెరుగ్గా వ్యవహరించి ధన్ఖడ్ సంఘటన ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంది. ధన్ఖడ్ పదవిని ఆశించేవారిని చాలా ముందుగానే హెచ్చరించి ఉండవచ్చు. ధన్ఖడ్ కూడా తనను ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేను అని, రాజ్యాంగ పదవికి ఎటువంటి హాని చేయలేను అని అర్థం చేసుకుని ఉండవచ్చు. చెలరేగిన వివాదం చల్లారిపోతుంది.
కానీ, ఖచ్చితంగా ఇది రాజకీయ తుపాను. మెరుగైన వైఖరి, మెరుగైన నిర్వహణతో ఉన్నత పదవులకు ఎదురైన అనవసరమైన ఇబ్బందిని ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ ఉదంతం ద్వారా.. అకస్మాత్తుగా ఏ రాజకీయ నాయకుడైనా తన పదవిని ఎప్పుడైనా కోల్పోయే ప్రమాదం ఉందని, శక్తిమంతమైన రాజకీయ పార్టీలు కూడా సంఘటనలను, ప్రజలను నియంత్రించలేవని తెలుసుకోవడం చాలా మంచిది.
- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్-