తాగిన మైకంలో తండ్రి ఘాతుకం

తాగిన మైకంలో తండ్రి  ఘాతుకం

కంది, వెలుగు :  తాగిన మైకంలో కన్న కూతురిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపాడో తండ్రి. అతడిని సంగారెడ్డి టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేశ్​కుమార్ వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాకు చెందిన మడావత్ సురేశ్​(25)  భార్య అనిత తన రెండేండ్ల కూతురు నందినితో కలిసి రెండు నెలల క్రితం సంగారెడ్డికి వచ్చి కింది బజారులో అద్దె ఇంట్లో ఉంటోంది. సురేశ్ ​తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతుండగా అనిత సంగారెడ్డి పాత బస్టాండ్ దగ్గరున్న వైన్స్ దగ్గర మిర్చి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తోంది.

ఈనెల 14న సురేశ్ ​భార్య దగ్గర రూ.వంద అడుక్కొని అక్కడే వైన్ షాప్ లో మద్యం తాగి కూతురుని తీసుకొని ఇంటికి వెళ్లాడు. అయితే, ఇంటికి వెళ్లాక నందిని ఆపకుండా ఏడుస్తుండడంతో విసుగు చెందిన సురేశ్​ పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. కాలితో తంతూ చేతులతో గుద్దుతూ నేలకేసి కొట్టడంతో పాప స్పృహ కోల్పోయింది. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన అనిత పాపని చూసి ఏమైందని భర్తను అడగ్గా తాగిన మైకంలో కొట్టానని చెప్పాడు. ఆమె చుట్టుపక్కల వారి సాయంతో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే పాప చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.  దీంతో భర్తపై సంగారెడ్డి టౌన్ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సురేశ్​ను  అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి టౌన్ సీఐ  శ్రీధర్ రెడ్డి ఉన్నారు.