పాంటింగ్ ఉంటే అలా జరిగుండేది కాదు

పాంటింగ్ ఉంటే అలా జరిగుండేది కాదు

న్యూఢిల్లీ: రాజస్థాన్ తో మ్యాచ్ లో చివరి ఓవర్ లో నో బాల్ వివాదం రేగడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే వ్యవహరించిన తీరు సరికాదన్నాడు. కోచ్ రికీ పాంటింగ్ ఉంటే ఇలా జరిగుండేది కాదన్నాడు. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రవీణ్ ఆమ్రే పిచ్ మీదకు రావడం సరికాదన్నాడు. అంపైర్ల నిర్ణయం కంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది చర్యలే తనను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాడు. కాగా, హెడ్​కోచ్​ రికీ పాంటింగ్​ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్​గా తేలింది. దీంతో పాంటింగ్ ఐసోలేషన్​కు వెళ్లాడు. 

'రికీ పాంటింగ్ మైదానంలో ఉంటే ఇలా జరిగుండేది కాదు. కోచింగ్ సిబ్బందిలో ఒకర్ని పిచ్ వద్దకు పంపిన పంత్ ప్రవర్తనను ఎవరైనా తప్పుబట్టాల్సిందే. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. తప్పులు జరగడం సహజం. ఔట్ అయిన సందర్భాల్లో నాటౌట్ గా, ఔట్ కానప్పుడు ఔట్ గా ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగని ఇలా ప్రవర్తిస్తారా? ఇది క్రికెట్ కు మంచిది కాదు. ఇది చాలా పెద్ద తప్పు' అని పీటర్సన్ పేర్కొన్నాడు. 

ఇకపోతే, రాజస్థాన్ తో మ్యాచ్ లో 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమైన సమయంలో.. రోమన్‌ పావెల్‌ (36) వరుసగా మూడు సిక్సర్లు కొట్టి డీసీ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మూడో బంతి నోబాల్‌లా కనిపించినా అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కాసేపు వివాదం తలెత్తి మ్యాచ్‌ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే పంత్‌ తమ ఆటగాళ్లను వెనక్కి వచ్చేయమని చెప్పడం, సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడటం జరిగింది. దీంతో ఇదంతా పెను దుమారం రేపింది.

మరిన్ని వార్తల కోసం:

ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్

ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం