ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం

ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం

మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా వచ్చి ముంబైలోని నవనీత్ కౌర్ నివాసం దగ్గర ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మర్చిపోయారని.. అది గుర్తు చేసేందుకు ఆయన ఇంటి ఎదుట తన భర్త ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం హనుమాన్ చాలీసా చదువుతానని గురువారం నవనీత్ ప్రకటించారు. టైమ్ అయినా నవనీత్ కౌర్ రాలేదని.. ఆమె ఇంటి దగ్గరికి భారీగా జనం వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని నినాదాలు చేశారు.

మరోవైపు ఠాక్రేకు మద్దతుగా ఆయన నివాసం దగ్గరకు భారీగా మహిళలు తరలివచ్చారు. తాము హనుమాన్ చాలీసా ప్రతులను కూడా తీసుకొచ్చామని, నవనీత్ కౌర్ రాణా వచ్చి దాన్ని పఠించాలని అన్నారు. నవనీత్ రాణా మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ మతోశ్రీకి చేరుకుని తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని స్పష్టం చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కావాలనే శివసేన కార్యకర్తలను పంపారని ఆరోపించారు. తనలాంటి వాళ్లను జైలుకి పంపడం తప్ప ఉద్ధవ్ ఠాక్రేకి మరేం తెలియదని విమర్శించారు.

నవనీత్ రాణా, ఆమె భర్త శాంతి భద్రతలను సవాల్ చేస్తున్నారని.. వారిని వెనుకనుంచి ఎవరో నడిపిస్తున్నారని ఆరోపించారు శివసేన పార్టీ నేత అనిల్ దేశాయ్. పోలీసులు పరిస్థితిని అదుపుచేస్తున్నారన్నారు. శివసేన కార్యకర్తలు భారీగా రావడంతో ఠాక్రే నివాసం సహా నవనీత్ రాణా ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.