ఇద్దరు దొంగల అరెస్ట్... విలువైన వస్తువులు స్వాధీనం

ఇద్దరు దొంగల అరెస్ట్... విలువైన వస్తువులు స్వాధీనం

కుత్బుల్లాపూర్‌: దసరా పండుగ కోసం  ఊర్లకు వెళ్తున్న ఇంటి యజమానులు తమ ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాలానగర్ డీసీపీ సందీప్ కోరారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో డీసీపీ సందీప్ మాట్లాడుతూ... షాపూర్ నగర్ లో అనుమాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ ఫయాసుద్దీన్, మహమ్మద్ జుమ్మాన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. వారిద్దరిని పాత నేరస్థులుగా గుర్తించామని, ఇప్పటికే మహమ్మద్ ఫయాసుద్దీన్ పై 21,  మహమ్మద్ జుమ్మాన్ పై 14 కేసులు నమోదు అయినట్లు డీసీపీ చెప్పారు. 

వారి వద్ద నుంచి 61.34 గ్రాముల బంగారు ఆభరణాలు, 454 గ్రాముల వెండి, 2 మోటార్ బైక్స్, 8 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. వాటి విలువ రూ. 4 లక్షల 7 వేల 5 వందల వరకు ఉంటుందని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ సందీప్ పేర్కొన్నారు. దసరా పండగ సమీపిస్తున్న సందర్భంగా దొంగలు తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందని డీసీపీ చెప్పారు. పోలీసుల సూచనలు పాటించి దొంగల బారిన పడకుండా జాగ్రత్త పడాలని ప్రజలను కోరారు. ఎవరైనా అనుమాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.