వనపర్తి, వెలుగు : జిల్లాలోని మహిళలు, బాలికలు ఎవరూ కన్నీరు పెట్టుకోవద్దని, మీకు అండగా షీ టీమ్ఉంటుందని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ అన్నారు. షీటీం, భరోసా సెంటర్, ఏహెచ్టీయూ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కాలేజీలో మహిళలు, బాలికలకు భద్రతా భరోసా కల్పించే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షీటీం అంటే కేవలం పోలీస్ యూనిట్ మాత్రమే కాదని, ఇది ఒక భరోసా కేంద్రమని పేర్కొన్నారు.
ఈవ్ టీజింగ్, వేధింపులు, ఆన్‌లైన్ బెదిరింపులు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులే మీ మొదటి మిత్రులుగా భావించి స్పందించాలన్నారు. ఫేక్ ఐడీలు, మోసపూరిత లింకులు, బ్లాక్‌మెయిల్, మార్ఫింగ్ వంటి ప్రమాదాల నుంచి మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో షీ టీం ఎస్సై అంజాద్, షీ టీం, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.
