డీడీలు కడ్తలేరు! గొర్రెల పంపిణీ ఇన్​టైంలో ఉంటదో.. లేదోనని గొల్లకుర్మల అనుమానం

డీడీలు కడ్తలేరు! గొర్రెల పంపిణీ ఇన్​టైంలో ఉంటదో.. లేదోనని గొల్లకుర్మల అనుమానం
  • తొలివిడత అవకతవకలతో ఆలోచనలోపడిన లబ్ధిదారులు
  • రెండో విడతలో  డీడీలు కట్టింది 15 శాతమే.. 

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణీ ఇన్​టైంలో ఉంటదో.. లేదోనని డీడీలు కట్టేందుకు చాలా మంది లబ్ధిదారులు వెనుకముందు అవుతున్నారు. ఇప్పటి వరకు యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో 15 శాతానికి మించి డీడీలు కట్టలేదు. మొదటి విడతలో జరిగిన అవకతవకలతో లబ్ధిదారులు రెండో విడతపై ఇంట్రెస్ట్​ చూపడం లేదని తెలుస్తోంది.  

2017లో పంపిణీకి శ్రీకారం

గొర్రెల పంపిణీకి 2017లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ స్కీంతో గొర్రెల ద్వారా ఉపాధి మరింత పెంచుకోవాలని కాపరులు ఆశించినా అనుకున్నట్టుగా ఫలితం రాలేదు. ఇస్తున్న పైసలు సరిపోవన్న కారణంగా గొర్రెలను తగ్గించి ఇచ్చారు. వచ్చిన గొర్రెలు ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక కొన్ని చనిపోయాయి. ఈ కారణంగా కొందరు కాపరులు తమకు వచ్చిన గొర్రెలను తక్కువైనా సరే దళారులకు అమ్మేసుకున్నారు. వాటా ధనం చెల్లించిన తర్వాత మూడేండ్ల వరకూ రావడంతో కాపరులు ఇబ్బందులు పడ్డారు. కొందరు తాము చెల్లించిన వాటాను వాపసు తీసుకున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్​ ఉప ఎన్నికప్పుడు రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామని సర్కారు ప్రకటించింది.

మునుగోడు ఉప ఎన్నికల టైంలో గొర్రెలను ఇస్తామని ప్రకటించడం, ఎన్నికల కమిషన్​ అడ్డుకోవడంతో బీజేపీ అడ్డుకున్నదని చెబుతూ ఎన్నికల్లో అధికార పార్టీ లబ్ధి పొందింది. అయితే రెండో విడత గొర్రెల పంపిణీలో యూనిట్​ విలువను పెంచడంతో పాటు రాయితీని పెంచింది. మొదటి విడతలో యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు కాగా, లబ్ధిదారుడి వాటా రూ.31,250 చెల్లించారు. రెండో విడతలో యూనిట్‌విలువ రూ.1.75 లక్షలు కాగా, లబ్ధిదారుడి వాటా 25 శాతం రూ.43,750 డీడీ తీసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కాగా, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం కలెక్టర్‌ జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. గొర్రెల యూనిట్ల రవాణా కోసం టెండర్లని ఇటీవల
 పూర్తి చేశారు. 

అనేక అనుమానాలు.. అందుకే తగ్గిన ఆసక్తి.. 

మొదటి విడతలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కాపరులు, ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తదేమోనని అనేక అనుమానాలతో స్కీంపై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. వాటా డబ్బులు చెల్లించిన పది  రోజుల్లోనే గొర్రెల పంపిణీ వుంటుందని ప్రభుత్వం ప్రకటించినా అంతగా నమ్మడం లేదు. హుజూరాబాద్​, మునుగోడు ఎన్నికల టైం మాదిరిగానే ఇప్పుడు కూడా ఎన్నికల స్టంట్ గానే మారుతుందని, తీరా డబ్బులు చెల్లించిన తరువాత తమకు గొర్రెలు రాకుండా పోతాయని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లబ్ధిదారుల వాటాగా చెల్లించే మొత్తం డీడీ రూపంలో వుండగా, గొర్రెలు రాని పక్షంలో మార్చుకొనే వీలుండేది. ఈ దఫా లబ్ధిదారుల వాటాలను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుండంతో తమకు గొర్రెలు రాకపోతే డబ్బులు తిరిగి రావేమో నని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రిలో 10 శాతం..  సూర్యాపేటలో 15 శాతం

రెండో విడత గొర్రెల పంపిణీ స్కీంలో యాదాద్రి జిల్లాకు 15,390 లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో ఇప్పటివరకూ 1509 మందిలో ఒక్కొక్కరు తమ వాటా కింద రూ. 43,750 చెల్లించారు. వీరిలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్​, సంస్థాన్​ నారాయణపురం మండలాలకు చెందిన వారే దాదాపు 1300 మంది ఉన్నారు.  వీరిలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వాటా చెల్లించినవారే ఎక్కువగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో రెండో విడత  టార్గెట్ గా 16, 288 మంది లబ్ధిదారులకు  గాను 2,800 మంది లబ్ధిదారులు మాత్రమే వాటా చెల్లించారు. దీంతో ఇప్పటి వరకు 15శాతం మాత్రమే టార్గెట్పూర్తయింది. 

అవగాహన కల్పిస్తున్నాం

గొర్రెల పంపిణీ స్కీంపై కాపరులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే డీడీలు కట్టేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. కాపరులకు వర్చువల్​ ఐడీలు ఇచ్చాం.  డాక్యూమెంట్లు అప్​లోడ్​ చేస్తున్నాం. - డాక్టర్​ కృష్ణ,  పశువైద్యాధికారి, యాదాద్రి