
- ఏఈఈ, డీఈవో పరీక్షలకు డీఈ రమేశ్ మాస్టర్ స్కెచ్
- ఆరుగురి అరెస్టు.. కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్న సిట్
- పరీక్ష మొదలైన 10 నిమిషాల్లోనే వాట్సాప్‌కు క్వశ్చన్ పేపర్
- ఇన్విజిలేటర్‌తో ముందే డీల్ చాట్ జీపీటీతో ఏడుగురు అభ్యర్థులకు జవాబులు
- టెక్నికల్ సమస్య కారణంగా ఇద్దరికి అందని ఆన్సర్లు
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం బయటపడింది. డీఈ రమేశ్ 8 మందితో కలిసి డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మైక్రో రిసీవర్స్, ఇయర్ బగ్స్ సాయంతో ఎగ్జామ్ సెంటర్స్‌లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు జవాబులు అందించాడు. దీని కోసం హై టెక్నాలజీతో ఓ కంట్రోల్ రూమ్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. హైటెక్ కాపీయింగ్ కేసులో జూనియర్ అసిస్టెంట్ పూల రవికిశోర్, రాయపురం దివ్య, రాయ పురం విక్రమ్, భరత్ నాయక్, పసికంటి రోహిత్ కుమార్, గాదె సాయిమధులను గురువారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీ తీసుకుని సిట్ విచారిస్తున్నది. డీఈ రమేశ్‌ను వారం రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.
పలు కేసుల్లో నిందితుడిగా రమేశ్
2015లో రమేశ్ రెండో భార్య హత్య జరిగింది. ఈ కేసుతో పాటు మరో కేసులో రమేశ్ నిందితు డుగా ఉన్నాడు. దీంతో అతనిపై డిపార్ట్‌మెంట్ యాక్షన్ తీసుకుంది. అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాడు. పేపర్ లీకేజీకి ముందే డీఈ రమేశ్ హైటెక్ మాస్ కాపీయింగ్ ప్లాన్ చేసినట్లు సిట్ విచారణలో బయపడింది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రమేశ్‌తో పాటు మరో 8మంది హైటెక్ కాపీయింగ్‌కు స్కెచ్ వేశారు. ఇందుకోసం అవసరమైన మైక్రో రిసీవర్స్, మైక్రో ఇయర్ బగ్స్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు.
మాస్ కాపీయింగ్ పై డెమో
మాస్ కాపీయింగ్ కోసం సేకరించిన ఎక్విప్మెంట్తో డెమోలు నిర్వహించారు. సెటప్ మొత్తం రెడీ అయ్యాక రమేశ్ తన బంధువు పూల రవికిశోర్‌తో కలిసి అభ్యర్థుల కోసం సెర్చ్ చేశారు. సిటీలోని కోచింగ్ సెంటర్స్‌లోని అభ్యర్థులను కాంటాక్ట్ అయ్యారు. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలు రాస్తున్న అభ్యర్థులను గుర్తించారు. పాపారావు అనే వ్యక్తి ముగ్గురు డీఏవో, నలుగురు ఏఈఈ అభ్యర్థులకు మాల్ ప్రాక్టీస్ విషయం చెప్పాడు. వారికి నమ్మకం కలిగిన తర్వాత డీల్ సెట్ చేసుకున్నారు. పరీక్షకు ముందే అడ్వాన్స్‌లు తీసుకున్నారు.
డీఏవో, ఏఈఈ పేపర్ కాపీయింగ్ సక్సెస్
పరీక్షలకు ముందే రమేశ్ టోలీచౌకీలోని ఓ కాలేజీ ప్రిన్సిపాల్ అలీని కలిశాడు. ఇతను ఇన్విజిలేటర్‌గా వెళ్తుండటంతో తమకు సహకరిస్తే పెద్దమొత్తంలో డబ్బులిస్తామని ఆశ చూపాడు. అడ్వాన్స్‌గా కొంత ముట్టజెప్పాడు. డీఏవో, ఏఈఈ పేపర్స్ వాట్సాప్ ద్వారా తనకు పంపించాలని చెప్పాడు. అభ్యర్థులు, సెంటర్స్ వివరాలు మాత్రం చెప్పలేదు. సైదాబాద్‌లోని ఓ ఇంటిని రెంట్‌కు తీసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాలకే ఇన్విజిలేటర్ అలీ జనవరి 22న డీఏవో, ఫిబ్రవరి 26న ఏఈఈ క్వశ్చన్ పేపర్స్‌ను వాట్సాప్‌లో రమేశ్‌కు పంపించాడు. క్వశ్చన్స్కు చాట్ జీపీటీలో రమేశ్ టీమ్ ఆన్సర్స్ సెర్చ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు చెప్పింది. వీరి సాయంతో ముగ్గురు డీఏవో, నలుగురు ఏఈఈ ఎగ్జామ్స్ రాశారు. వీరిలో ఇద్దరికి టెక్నికల్ సమస్య కారణంగా ఆన్సర్స్ అందకపోవడంతో వారు క్వాలిఫై కాలేకపోయారు.
సురేశ్ ద్వారా ఏఈ పేపర్స్ సేల్
డీఏవో, ఏఈఈ మాస్ కాపీయింగ్‌లో రమేశ్ టీమ్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే మార్చి 6న జరిగే ఏఈ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ చేసేందుకు రమేశ్ ప్లాన్ చేశాడు. అప్పటికే టీఎస్పీఎస్సీలోని మాజీ టెక్నీషియన్ సురేశ్ వద్ద ఏఈ పేపర్ ఉన్న విషయం తెలుసుకున్నాడు. రవి కిశోర్‌తో కలిసి 30 నుంచి 40 మంది అభ్యర్థులకు ఏఈ పేపర్ సేల్ చేశారు. ఇందులో ఉప్పల్‌కు చెందిన భరత్‌నాయక్, వరంగల్‌కు చెందిన పసికంటి రోహిత్ కుమార్, గాదె సాయి మధు, సతీశ్ కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. మాల్ ప్రాక్టీస్‌తో ఏఈఈ, డీఏవో పరీక్షలు రాసిన ప్రశాంత్, వదిత్య నరేశ్, మహేశ్‌తో పాటు మీడియేటర్ శ్రీనును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.