
కొడిమ్యాల, వెలుగు: పెండ్లి అయ్యి 20 ఏండ్లు అవుతున్నా సంతానం కలగడం లేదని, కుటుంబ కలహాలకు కారణమవుతోందని వారం రోజుల కింద భార్యను హత్య చేశాడు. ఆ తరువాత ఇంట్లోనే డెడ్‌బాడీని ఉంచడంతో, కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.
ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన అవుదుర్తి మహేందర్ కు, మమతతో వివాహం జరిగింది. కొద్ది కాలంగా కుటుంబంలో ఆస్తుల విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. దీంతో భర్త మహేందర్, అత్తమామలు లక్ష్మణ్, వజ్రవ్వ, మరుదులు అనిల్, వెంకటేశ్ కట్నం తీసుకు రాలేదని, పిల్లలు కాలేదని మమతను మానసికంగా వేధించేవారు. ఈ క్రమంలో మమతను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
గత నెల 26న సొంత ఇంట్లో మమతను మహేందర్ హత్య చేశాడు. డెడ్‌బాడీని ఇంట్లోనే పెట్టి ఉంచాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై మమత తల్లిదండ్రులు మహేందర్ ను, అతడి కుటుంబ సభ్యులను నిలదీయడంతో సమాధానం దాట వేస్తూ వచ్చాడు.
అనుమానం వచ్చి మమత తల్లిదండ్రులు శుక్రవారం కొడిమ్యాలకు వచ్చి ఇంటిలో చూడగా మమత డెడ్ బాడీ కుళ్లిపోయి కనిపించింది. మమత తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు.