అదృశ్యమైన వృద్ధురాలు మృతి.. అద్దెకుంటున్న వారిపై అనుమానం

అదృశ్యమైన వృద్ధురాలు మృతి.. అద్దెకుంటున్న వారిపై అనుమానం
  • కాలువలో కనిపించిన 90 ఏండ్ల వృద్ధురాలి మృతదేహం
  • ఇంట్లో కిరాయికి దిగినవారిపైనే అనుమానం

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అదృశ్యమైన వృద్ధురాలు నాలుగు రోజుల తర్వాత కాల్వలో మృతదేహమై కనిపించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లి ప్రాంతానికి చెందిన జాగీర్దార్ ప్రభావతి బాయి(90)కి ఇద్దరు కొడుకులు. పట్టణంలోనే మరో ప్రాంతంలో కొడుకులు ఉంటున్నారు. ప్రభావతి పాత ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఒక పోర్షన్​లో ఆమె ఉంటూ మరో రెండు గదులను కిరాయికి  ఇచ్చింది. నాలుగు రోజులుగా ప్రభావతి అగుపించడం లేదు. దాంతో కుటుంబసభ్యులు ఇంట్లో కిరాయికి  దిగినవారిపై అనుమానం వ్యక్తం చేస్తూ టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం నిజామాబాద్ మండల పరిధిలోని కొత్తపేట్ గ్రామ పరిధి నిజాంసాగర్ కెనాల్ లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు  పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ప్రభావతిదిగా పోలీసులు గుర్తించారు.

ఇంట్లోనే హత్య.. నగల చోరీ

పది రోజుల క్రితం ప్రభావతి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు కిరాయికి దిగారు. ఆమె ఒంటరిగా ఉండడం, ఒంటిపై సుమారు 5 తులాల వరకు బంగారు నగలు ఉన్న విషయాన్ని పసిగట్టి వారే ఇంట్లోనే వృద్ధురాలిని హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం ఆమె ఒంటిపై నగలను దోచుకొని మృతదేహాన్ని ఆటోలో కొత్తపేట్ గ్రామం పరిధికి తీసుకువెళ్లి అక్కడ కెనాల్ లో పడేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇంట్లో కిరాయికి  దిగినవారు అగుపించకపోవడంతో అనుమానితుల ఫొటోల  ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నగరంలోని శాస్త్రి నగర్ ప్రాంతానికి చెందినవారుగా తెలియవచ్చింది. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. నగర సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

dead-body-of-90-year-old-woman-found-in-the-canal