ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెను భూకంపం 32 మంది మృతి ..200 మందికి గాయాలు.. కూలిన భవనాలు

ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెను భూకంపం  32 మంది మృతి ..200 మందికి గాయాలు.. కూలిన భవనాలు
  • ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెను భూకంపం 32 మంది మృతి
  • 200 మందికి గాయాలు.. కూలిన భవనాలు
  • సముద్ర గర్భంలో 7.8 తీవ్రతతో కంపించిన భూమి
  • తీరం వెంబడి ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సునామీ అలలు
  • జపాన్, ఇండోనేసియా దేశాల్లోనూ ప్రభావం

మనీలా: ఫిలిప్పీన్స్‌‌‌‌లోని మిండానావో తీరంలో సోమవారం ఉదయం పెను భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో 33 కిలోమీటర్ల లోతున 7.8 తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద పడి 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాల్లోకి సుమారు 1 మీటరు (3 అడుగులు) ఎత్తున అలలు దూసుకురావడంతో ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ సునామీ ప్రభావంతో  ఇండోనేసియా, పలావులతో పాటు దక్షిణ జపాన్ తీరాల్లో కూడా అలలు భారీగా ఎగిసిపడ్డాయి. జపాన్ పట్టణమైన కుషిమోటోలలో 20 సెంటీమీటర్ల (7.8 అంగుళాలు) వరకు అలలు ఎగిసిపడ్డాయని జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. 


భారీ ఆస్తి నష్టం


ఈ భూకంపం ధాటికి జనరల్ శాంటోస్ నగరంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. కొన్ని చిన్న భవనాలతోపాటు ప్రముఖ హ్యాంబర్గర్ జాయింట్ పూర్తిగా కుప్పకూలాయి. సుమారు 100 కోట్ల ఫిలిప్పీన్ పెసోలు (రూ.170 కోట్ల పైమాటే) ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. సరాంగని ప్రావిన్స్‌‌‌‌లోని కొండ ప్రాంతమైన గ్లాన్ టౌన్‌‌‌‌లో ఇండ్లపై కొండచరియలు విరిగిపడటంతో 13 మంది గ్రామస్తులు అక్కడికక్కడే మరణించారు. రెండంతస్తుల స్కూల్ బిల్డింగ్ కూలిపోవడంతో..12 మంది స్టూడెంట్లు గల్లంతైనట్లు పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు.


17 దేశీయ విమాన సర్వీసులు రద్దు


భారీ విపత్తు నేపథ్యంలో జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. 17 దేశీయ సర్వీసులను రద్దు చేశారు.