‘రింగ్’లోకి పోతే..వచ్చుడు కష్టమే

‘రింగ్’లోకి పోతే..వచ్చుడు కష్టమే
  • ఆటలో దెబ్బల వల్ల ఏటా 13 మంది బాక్సర్లు మృతి
  • 1890 నుంచి 2011 వరకూ 1,604 మంది కన్నుమూత

బాక్సింగ్ అంటేనే.. లైఫ్​ అండ్ డెత్ గేమ్. రింగ్ లోకి దిగిన బాక్సర్లు బయటికి వచ్చేవరకూ ఎవరి పరిస్థితి ఎలా ఉంటదో ఎవరూ చెప్పలేరు! తగలరాని చోట దెబ్బలు తగిలితే రింగ్‌‌‌‌‌‌‌‌లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటది. ఇలాంటి ప్రమాదాల్లోనే ఏటా యావరేజ్‌‌‌‌‌‌‌‌గా13 మంది బాక్సర్లు రింగ్‌‌‌‌‌‌‌‌లోనే ప్రాణాలు వదులుతున్నారట! ఇలా1890 నుంచి 2011 వరకూ1,604 మంది రింగ్​లో తగిలిన దెబ్బల వల్లే చనిపోయారట. ‘డెత్ అండర్ ద స్పాట్ లైట్: మాన్యుయెల్ వేలాక్వెజ్ కలెక్షన్, 2011’ పేరుతో జోసెఫ్​ఆర్ స్వింత్ చేసిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు రింగ్ లో దెబ్బలు తగిలి చనిపోతున్న బాక్సర్ల సంఖ్య తగ్గుతోందని స్వింత్ పేర్కొన్నారు. 1920లలో 233 మంది చనిపోగా, 2000లలో 103 మందే చనిపోయారని తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటికే నలుగురు..

ప్యాట్రిక్ డే ఇరవై ఏడేళ్ల అమెరికన్ బాక్సర్. ఇటీవల ఓరోజు రింగ్​లో ప్రత్యర్థి చార్లెస్ కాన్వెల్ విసిరిన పంచ్​లు నేరుగా తలకు తాకాయి. నాలుగు రోజుల తర్వాత ప్యాట్రిక్ కన్నుమూశాడు. ఈ సంవత్సరం రింగ్​లో దెబ్బల కారణంగా చనిపోయిన నాలుగో బాక్సర్ ఇతను. ప్యాట్రిక్ చనిపోయిన తర్వాత ఎమోషనల్ అయిన కాన్వెల్ మాట్లాడుతూ.. ‘‘ఆటలో నేను చేసినవన్నీ గెలవడం కోసమే. ఇప్పుడు అవన్నీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటే తప్పకుండా తీసుకునేవాడిని” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆల్బేనియాలో జరిగిన ఓ ఫైట్ లో బల్గేరియాకు చెందిన బోరిస్ స్టాంచోవ్ అనే బాక్సర్ కూడా రింగ్ లో దెబ్బలు తగలడం వల్ల చనిపోయాడు. జులైలోనూ రష్యాకు చెందిన మాక్సిమ్ డాదాషెవ్, అర్జెంటినాకు చెందిన హ్యూగో ఆల్ఫ్రెడో శాంటిల్లన్ కూడా ఇలాగే బాక్సింగ్ లో గాయపడి చనిపోయారు. ఈ ఏడాది వీరే కాకుండా మరో ఐదుగురు హాస్పిటల్ పాలయ్యారు. ఆపరేషన్ చేసి, వాళ్ల మెదళ్లలో రక్తం గడ్డలను తీసేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, తలపై పంచ్​తో నాకౌట్ చేసే ప్రయత్నంలో బాక్సర్లు ప్రత్యర్థులను ఇలా గాయపరుస్తుంటారని, ఇప్పటికైనా ప్రాణాంతకమైన ఇలాంటి బాక్సింగ్ రూల్స్ మార్చాలని పలువురు అనలిస్టులు అంటున్నారు.