
1983లో మహారాష్ట్రలో నలుగురు స్టూడెంట్ల ఉరితీత
మందుకు బానిసై 10 మందిని చంపిన యువకులు
వరుస హత్యలతో పుణే జనాన్ని భయపెట్టిన గ్యాంగ్
నిర్భయ దోషులు నలుగురికి ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ నలుగురినీ జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైలులోని మూడో నంబర్ గదిలో ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా ఒకేసారి నలుగురిని ఉరి తీయడం దేశంలో ఇదే తొలిసారి కాదు. మహారాష్ట్రలో వరుస హత్యలు చేసిన నలుగురు స్టూడెంట్లను 36 ఏళ్ల క్రితం 1983లో ఒకేసారి ఉరి తీశారు. ఈ నలుగురు స్టూడెంట్లు 1970ల్లో వరుస హత్యలకు పాల్పడ్డారు. జల్సాలకు అలవాటు పడి, వ్యసనాలకు బానిసై 10 మందిని కిరాతకంగా చంపేశారు.
పట్టపగలే ఇండ్లల్లోకి జొరబడి..
రాజేంద్ర జక్కల్, దిలీప్ సుతార్, శాంతారాం జగ్తాప్.. పుణేలోని అభినవ్ కళా మహావిద్యాలయలో ఆర్ట్స్ స్టూడెంట్లు. వీళ్ల ఫ్రెండ్ మునావర్ షా కామర్స్ కాలేజీలో చదివేవాడు. వీళ్లు నలుగురూ వ్యసనాలకు బానిసై, తాగేందుకు డబ్బుల్లేక దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డారు. మొదట తోటి స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసి చంపారు. తర్వాత పట్టపగలే ఇండ్లల్లోకి చొరబడి దోపిడీలు చేసి హత్యలు చేయడం మొదలుపెట్టారు. నోట్లో దూది కుక్కి, గొంతుకు నైలాన్ తాడు బిగించి చంపేవారు. 1976 నుంచి 77 మధ్య జరిగిన ఈ హత్యాకాండ పుణే జనాలను హడలెత్తించింది.
ఆరయిందంటే రోడ్లు ఖాళీ..
1976లో తొలిసారి తమ తోటి స్టూడెంట్ ప్రసాద్ హెగ్డేను ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపింది. తర్వాత జోషి అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ముగ్గురిని విజయ్‌నగర్ కాలనీలోని వాళ్ల ఇంట్లోనే చంపేసింది. భండార్కర్ రోడ్‌లో ఉండే కాశీనాథ్శాస్త్రి అభయంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీలోని మరో ఐదుగురిని వాళ్ల బంగ్లాలోనే హత్య చేసింది. మరో ఘటనలో ఓ యువకుడిని చంపింది. ఈ సీరియల్ మర్డర్లు పుణేను షేక్ చేశాయి. ఎవరు చంపుతున్నారో తెలియక జనం భయపడిపోయారు. ఆరయిందంటే రోడ్లపైకి వచ్చేందుకే భయపడ్డారు. అప్పుడప్పుడు వచ్చే పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ తప్ప ఇంకేం సౌండ్ వినిపించేది కాదని ఆ కాలం నాటి వ్యక్తులు గుర్తు చేసుకున్నారు.
అస్సలు కనిపెట్టలేకపోయాం: టీచర్లు
నలుగురు స్టూడెంట్లు చాలా బాగా మాట్లాడే వారని, పెద్దలకు గౌరవమిచ్చే వారని అభినవ్ కళా మహావిద్యాలయలో అడ్వర్టయిజింగ్, గ్రాఫిక్స్ పాఠాలు చెప్పే సుభాష్ పవార్ చెప్పారు. వాళ్లదంత క్రిమినల్ మైండని అస్సలు గుర్తించలేకపోయామన్నారు. హత్యల వెనుక వాళ్లే ఉన్నారని వార్తల్లో చదివి షాకయ్యామని చెప్పారు.
పుణే ఎరవాడ జైలులో ఒకేసారి..
వరుస హత్యల కేసును మహారాష్ట్ర పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. స్పెషల్ టీం వేసి కేసులను దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఏడాది పాటు కష్టపడి ఈ నలుగురు స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లకు సహకరించిన మరో స్టూడెంట్ సుహాస్ చందక్ అప్రూవర్‌గా మారి హత్యల గురించి చెప్పడంతో నలుగురిని అరెస్టు చేశారు. 1978లో కేసు విచారణ స్టార్టయింది. 4 నెలల్లోనే పుణే సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు కూడా తీర్పును సమర్థించింది. దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వాళ్ల పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించడంతో 1983లో అక్టోబర్ 25న పుణేలోని ఎరవాడ జైలులో ఒకేరోజు ఉరి తీశారు.