ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ‘ఇంకా పిల్లలు కనాలి’, ‘మూడో బిడ్డకు రూ.30,000 – నాలుగో బిడ్డకు రూ.40,000’ వంటి ప్రోత్సాహక ప్రకటనలు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆయన వాదన ఏమిటంటే .. ఆంధ్రప్రదేశ్‌లో జననాల రేటు తగ్గిపోతోంది, భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, పని చేసే యువత తగ్గిపోతుంది, కాబట్టి జనాభా పెంపు అవసరం. సంఖ్యల పరంగా చూస్తే ఈ ఆందోళన పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో టోటల్ ఫర్టిలిటీ రేట్(టీఎఫ్ఆర్) ప్రస్తుతం 1.5 వరకు పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే కనీసం 2.1 అవసరం అని జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవైపు రాష్ట్ర భవిష్యత్తు, జనాభా సమతుల్యత అనే సైంటిఫిక్ కోణం... మరోవైపు ఒక సామాన్య కుటుంబం అనుభవించే ఆర్థిక భారం, ఒక స్త్రీ పడే ప్రసవ వేదన, మారుతున్న సామాజిక పరిస్థితులు. ఈ రెండింటినీ బేరీజు వేయకుండా పిల్లలను కనండి అని చెప్పే ముందు.. ఆ తల్లుల మాతృత్వం వేదనను, పిల్లల జీవితాన్ని ఎవరు భరిస్తారు? అని ఎవరైనా ఆలోచిస్తున్నారా?
మహిళ శరీరం ప్రయోగశాల కాదు
జనాభా వ్యూహం సైంటిఫిక్ పరంగా సరైన ఆలోచన కావచ్చు. కానీ పిల్లల్ని కనడం అనేది ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే ప్రక్రియ కాదు. మాతృత్వం ఒక పునర్జన్మ. ప్రసవ వేదన మనిషి భరించగలిగే అత్యంత తీవ్రమైన నొప్పుల్లో ఒకటి. గర్భధారణ నుంచి కాన్పు వరకు మహిళ శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. భారతదేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో సుమారు 103 మంది తల్లులు మరణిస్తున్నారు. గర్భధారణ సమయంలో రక్తహీనత, గర్భకాల మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. కానీ మన రాజకీయ చర్చల్లో తల్లి మానసిక ఆరోగ్యం, ప్రసూతి అనంతర డిప్రెషన్, శారీరక పునరుద్ధరణ గురించి పెద్దగా చర్చ ఉండదు. ఇంకా పిల్లలును కనండి అనే ఒక్క మాటతో మహిళల జీవితాన్ని కొలవలేం. ఒక మహిళ గర్భం దాల్చిన క్షణం నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది.
ఒక బిడ్డ ఖర్చు..రూ.30-40 వేలుతో పూర్తవుతుందా?
ఒక మధ్యతరగతి కుటుంబం ప్రధాన ఆందోళన ఆర్థిక భారమే. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక సాయం శాశ్వత భవిష్యత్తును ఇవ్వలేదు. గర్భధారణ పరీక్షలు, స్కానింగులు, డెలివరీ, టీకాలు పోషకాహారం, స్కూలింగ్ , కోచింగ్, హాస్టల్,కాలేజ్ ఇలా ఒక పిల్లవాడిని డిగ్రీ వరకు పెంచడానికి సగటున రూ.15 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ.30,000 లేదా రూ.40,000 అనేది సముద్రంలో నీటి బొట్టు లాంటిదే. అయితే రూ.30 –- 40 వేలు ప్రోత్సాహకం ఇచ్చి ‘ఇంకా పిల్లలను కనండి’ అనడం ఆర్థిక వాస్తవాలను అవమానపరచడమే కదా? అందుకే సామాన్యుడు మేం లక్షల రూపాయల భారాన్ని ఎలా మోయగలం? అని ప్రశ్నించడంలో వంద శాతం న్యాయం ఉంది.
పరిష్కార మార్గాలు
జనాభా సమతుల్యత కోసం ఆలోచించడం రాష్ట్ర భవిష్యత్తు రీత్యా తప్పు కాదు. కానీ, విధానం మారాలి. కేవలం నగదు ఇచ్చి పిల్లల్ని కనండి అనడం వల్ల ఆశించిన ఫలితం రాదు. దానికి బదులుగా పుట్టే ప్రతి బిడ్డకు పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత కార్పొరేట్ వైద్యం ప్రభు త్వానిదే బాధ్యత అనే చట్టం తేవాలి. రెండోది ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాల పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి. మూడోది మద్య నిషేధం విధించాలి. చివరిగా ఒక స్త్రీ శరీరం, ఆమె మానసిక స్థితి, ఒక కుటుంబ ఆర్థిక శక్తుల కలయికే మాతృత్వం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఎంత ముఖ్యమో... ఒక సామాన్య తల్లి, ఆమె పిల్లల ఆకలి, చదువు, గౌరవప్రదమైన జీవితం కూడా అంతే ముఖ్యం. వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఏ ప్రభుత్వ విధానమైనా విజయవంతమవుతుంది.
- డాక్టర్. హర్షిణి భాషవత్తిని. ఎండీ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
