
- సివిల్ సప్లయిస్‌కు మిల్లర్ల నుంచి88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్
- వేల కోట్ల విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నరు
- సీఎంఆర్ పెండింగ్‌తో రూ.11, 500 కోట్ల లాస్
- ఎఫ్‌సీఐకి బియ్యం ఇస్తేనే కేంద్రం నుంచి నిధులు
- గత ప్రభుత్వ పెద్దల అండతో మిల్లర్ల ఇష్టారాజ్యం
- అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటున్న ఎక్స్‌పర్ట్స్
- సెక్యూరిటీ పెట్టుకుని వడ్లు ఇవ్వాలని ప్రతిపాదన
హైదరాబాద్, వెలుగు: మిల్లింగ్‌లో మితిమీరిన జాప్యం, అక్రమాలతో సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకున్నారు. టైమ్‌కు మిల్లింగ్ చేసి సీఎంఆర్ ఇవ్వక సివిల్ సప్లయ్స్ దాదాపుగా రూ.56 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. సీఎంఆర్ ఆలస్యం వల్ల ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోడం, ఫండ్స్లేక బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు మిత్తీలు, కిస్తీల చెల్లింపు తదితర కారణాలతో సివిల్‌సప్లయిస్ డిపార్ట్మెంట్కు రూ.11,500 కోట్ల నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ పెద్దల అండతోనే మిల్లర్లు ఇట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శలు వస్తున్నాయి.
పదేండ్లలో రైస్ మిల్లర్ల అవినీతికి అంతులేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి గ్యారెంటీ లేకుండా లక్షల టన్నుల వడ్లు తీసుకుంటున్న మిలర్లలో కొందరు బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఇంకొందరు విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొందరు అక్రమార్కులు ఇలా సొమ్ము చేసుకుంటున్నరు. సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తూతూమంత్రం దాడులు చేయడం తప్పితే చర్యలు తీసుకున్న దాఖలాలు పెద్దగా లేవు. గత ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు ఈ మిల్లర్లకు సపోర్టుగా ఉంటూ వారి నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లర్ల అక్రమాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారి ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. లక్షలాది టన్నుల వడ్లు తీసుకున్న కొందరు మిల్లర్లు ఏండ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు.
లక్షలాది టన్నుల వడ్ల మిల్లింగ్ పెండింగ్
ఈ సీజన్లో సేకరిస్తున్న ధాన్యమే కాకుండా.. పాత ధాన్యమే 88 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్ఉంది. దీని విలువ సుమారు రూ.22వేల కోట్లు. గత సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో సీఎంఆర్‌లో తీవ్ర ఆలస్యం జరిగి రూ.56వేల కోట్ల అప్పులు అయ్యాయి. ఈ అప్పులకు ఏటా రూ.3500 కోట్ల వరకు మిత్తీలు కట్టే పరిస్థితి ఉంది. మిల్లర్ల వద్ద ఉన్న 88 లక్షల టన్నుల్లో వందకు వంద శాతం వారి దగ్గర ఉందా అంటే అదీ లేదని తెలుస్తున్నది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దాదాపు రూ.5వేల నుంచి రూ.8 వేల కోట్ల విలువజేసే బియ్యం రైస్‌మిల్లర్లు ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నట్లు తెలుస్తోంది. సర్కారు వీరి చర్యలు తీసుకొని వాటిని వసూలు చేయాలని రైతు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గత యాసంగి వడ్లు 81శాతం మిల్లింగ్ పెండింగ్..
సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ గత యాసంగికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి 66.84లక్షల టన్నుల వడ్లు సేకరించింది. ఈ వడ్లు మిల్లింగ్ చేయించి 45.06 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటికి కేవలం 8.40లక్షల టన్నులు(18.64శాతం) మిల్లింగ్ పూర్తయింది. ఇంకా 81.36 శాతం మిల్లింగ్ కావాల్సి ఉంది. గత యాసంగి వడ్లే మరో 55 లక్షల టన్నుల వరకు మిల్లర్ల వద్దే ఉన్నాయి. నిరుడు వానాకాలం సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ 65.02లక్షల టన్నుల వడ్లు సేకరించింది. సేకరించిన వడ్లు రాష్ట్రంలోని మిల్లర్లకు అప్పగించింది. మిల్లింగ్ చేయించి 43.74లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే నిరుటివే ఇంకా 9.22లక్షల టన్నులు బియ్యం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా మూడేళ్లుగా మొత్తం 88 లక్షల టన్నులు రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్ఉంది. దీని విలువ సుమారు రూ.22 వేల కోట్లు కావటం గమనార్హం.
సెక్యూరిటీతో అక్రమాలకు అడ్డుకట్ట
కొత్తగా వచ్చిన సర్కారు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఇప్పటికైనా గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయక పోతే సివిల్ సప్లయిస్నిండా మునిగే పరిస్థితి నెలకొంది. మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ సేకరించే విధానం తీసుకువస్తే కొంత ఫలితం ఉంటుందనే వాదనలు ఉన్నాయి. పొరుగున ఉన్న చత్తీ్‌సగఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ‘సెక్యూరిటీ డిపాజిట్ సిస్టమ్’ అమలు చేస్తున్నారు. ఒక కోటి చెల్లిస్తే మూడు కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించే పధితి అమలులో ఉంది. ఇలాంటి విధానంతో మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చనే వాదనలు ఉన్నాయి. గ్యారంటీ విధానాన్ని అమల్లోకి తెస్తే మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నరు.