వారానికి ఐదు రోజులే బ్యాంకులు : డిసెంబర్ నుంచి అమల్లోకి..?

వారానికి ఐదు రోజులే బ్యాంకులు : డిసెంబర్ నుంచి అమల్లోకి..?

బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  అపెక్స్ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఎంప్లాయీ యూనియన్‌ల మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత బ్యాంక్ సిబ్బందికి అన్ని శనివారాలను సెలవు దినంగా చేయాలనే వారి ప్రతిపాదనను IBA గత నెలలో ఆమోదించింది. ఐబీఏ ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది.  ప్రస్తుతం ప్రభుత్వ,ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో నెలలో రెండు శనివారాలు సెలవులుగా ప్రకటించారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని కేంద్రం ఆమోదిస్తే.. ఇకపై అన్ని శనివారాలు సెలవు దినాలు పరిగణించబడతాయి. డిసెంబర్ లో ఈ వారానికి ఐదు రోజుల పని దినాల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రైవేట్ బ్యాంకులు, ఫిక్కీ, CII వంటి పరిశ్రమల సంస్థలతో సహా బ్యాంక్ మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

అయితే వారానికి ఐదు రోజుల పని దినాలపై కొన్ని బ్యాంక్ మేనేజ్ మెంట్ లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. తమ వ్యాపారాలు, ఉత్పాదకతపై ప్రభావం పడే అవకాశం ఉందని భయపడుతున్నాయి. అయితే ఐదు రోజుల పని వారానికి సంబంధించిన ఒప్పందంలో భాగంగా ఏదైనా పని నష్టాన్ని పూడ్చేందుకు బ్యాంకుల పని గంటలను రోజుకు 45 నిమిషాలు పెంచే అవకాశం ఉంది. 
ఒక నెలలో రెండు పనిదినాలు కోల్పోయినప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్‌ ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చన్ని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నగదు బదిలీలు, చెల్లింపులు వంటి లావాదేవీలను మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్‌లకు మార్చడం బ్యాంకింగ్ పరిశ్రమకు సహాయపడగలదంటున్నారు. ప్రసుత్తం నగదు ఉపసంహరణలు,డిపాజిట్లు ఇప్పుడు ATMల ద్వారా చేయవచ్చు.

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు వారానికి ఐదు రోజులు పని చేస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగుల కోసం వారానికి ఐదు రోజులు పని చేస్తుంది. డిసెంబర్ లో ఈ వారానికి ఐదు రోజలు పని విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 95వేల మంది, సహకార బ్యాంకుల్లో మరో 96వేల మంది ఉద్యోగులు ఉన్నారు. RRBలకు కూడా ఈ ఐదురోజులు పనిదినాల విధానం వర్తించే అవకాశం ఉంది.