
- సమావేశాలకు దూరంగా ఉంటామని సంకేతాలు
- కొనసాగుతున్న అవిశ్వాస ప్రయత్నాలు
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్‌లో అసమ్మతి పోరు నెలకొంది. నిన్న మొన్నటి వరకు అవిశ్వాసం పేరిట రచ్చ చేసిన రూలింగ్పార్టీ కౌన్సిలర్లు ఇప్పుడు రూట్మార్చారు. చైర్‌పర్సన్‌కు సహకరించొద్దనే దిశగా పావులు కదుపుతున్నారు. చైర్‌పర్సన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు మున్సిపల్ పాలకమండలి సమావేశాలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల కింద శానిటేషన్లేబర్కు సబ్బులు, దుస్తులు పంపిణీ కార్యక్రమానికి కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. దీంతో ఆ కార్యక్రమాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు. ఈనెల 31న మున్సిపల్ జనరల్‌బాడీ సమావేశం ఉండగా దానికీ హాజరుకావద్దనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలనే దిశగా కొద్దిరోజులుగా ఫాంహౌజ్ మీటింగ్‌లు జరిగినా.. తాజాగా దానిని పక్కనపెట్టి సహాయనిరాకరణ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే మౌన ముద్ర
చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మౌన ముద్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనగామ మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయాలు వేడి పుట్టించగా చేర్యాలలో ఇదే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చేర్యాల చైర్మన్ పదవి విషయంపై తనను కలసిన కౌన్సిలర్లతో చర్చించడమే కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్త కౌన్సిలర్లు కొంతమేర మెత్తబడ్డా.. తాజాగా సహాయ నిరాకరణకు తెరలేపుతున్నారు. చేర్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యే సానుకూలంగా ఉన్నట్లు.. కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఆ ప్రాసెస్తెలుసుకోవాలని ఓ బీఆర్ఎస్ కౌన్సిలర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వాట్సాప్‌గ్రూపుల్లో వైరల్ అవుతోంది.
అవిశ్వాసానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు సైచేర్యాల మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో అసమ్మతి వర్గానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. మున్సిపాలిటీలో ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయినా అవిశ్వాస నోటీసు విషయంలో అందరూ ఐక్యంగా ఉన్నారు. సోమవారం కొందరు అసంతృప్త కౌన్సిలర్లతో కలసి అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందజేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోది.
ప్యాకేజీ కోసం ప్రయత్నాలు
ప్రస్తుత చైర్‌పర్సన్ పదవిలో కొనసాగాలంటే తమకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్‌ను కొందరు కౌన్సిలర్లు ముందుకు తెస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక ప్యాకేజీ ఇస్తే ‘అవిశ్వాసం’ పక్కన పెడతామనే సంకేతాలను కొందరు కౌన్సిలర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైర్‌పర్సన్ హామీ పొందిన జుబేదా ఖతూన్ తనదైన రీతిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రూలింగ్పార్టీ కౌన్సిలర్ల కదలికలను ఎమ్మెల్యే నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పదవిని ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు ముదిరాజ్‌లు ఉండడంతో రాజకీయ పదవిని వారికే కట్టబెట్టాలనే ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
31న మున్సిపల్ సమావేశం
చేర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయాలు ఒకవైపు వేడి పుట్టిస్తుండగా ఈనెల 31న జనరల్‌బాడీ మీటింగ్నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇవ్వకుంటే సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్ కమిషనర్ లీవ్‌లో ఉండడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఒక్కరోజే లీవ్పెట్టారని చెబుతున్నా ఆయన సోమవారం డ్యూటీకి వస్తాడా లేడా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అవిశ్వాస నోటీసును మున్సిపల్ కమిషనర్‌కే ఇవ్వాలని కలెక్టరేట్ నుంచి సూచనలు రావడంతో సోమవారం కమిషనర్డ్యూటీకి రాకుంటే ఏం చేయాలనే దానిపై అసంతృప్త కౌన్సిలర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస రాజకీయాలు, కమిషనర్లీవ్లో ఉండడం, అసంతృప్త కౌన్సిలర్ల సహాయ నిరాకరణ వంటి అంశాలతో ఇప్పుడు చేర్యాల రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.