సార్లకు బయోమెట్రిక్ తీసేసి.. స్టూడెంట్లకు ఫేషియల్ అటెండెన్స్!..ఇంటర్మీడియెట్ విద్యా శాఖలో ఆఫీసర్ల వింత నిర్ణయం

సార్లకు బయోమెట్రిక్ తీసేసి.. స్టూడెంట్లకు ఫేషియల్ అటెండెన్స్!..ఇంటర్మీడియెట్ విద్యా శాఖలో ఆఫీసర్ల వింత నిర్ణయం
  • సర్కారు కాలేజీల్లో రెండు నెలలుగా పనిచేయని బయోమెట్రిక్  
  • గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో స్టూడెంట్ లకు ఫేషియల్ అటెండెన్స్  
  • పైలెట్ ప్రాజెక్టుగా అమలు.. త్వరలోనే అన్ని జిల్లాల్లో

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం సర్కారు కాలేజీల్లో  పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉన్న బయోమెట్రిక్​ అటెండెన్స్​ను పక్కనపెట్టేశారు. ఈ క్రమంలోనే స్టూడెంట్లకు మాత్రం ఏకంగా ఫేషియల్ అటెంటెన్స్​ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టేట్​లో 430 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. 

వీటిలో పనిచేస్తున్న సుమారు 9,500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేస్తున్నారు. టీఎస్​టీఎస్ ఆధ్వర్యంలో రెంట్ ద్వారా దీన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఏమైందో ఏమో గానీ.. జూన్ 2న కాలేజీలు రీఓపెన్ అయిన కొద్దిరోజులకే కాలేజీల్లోని బయోమెట్రిక్ అటెండెన్స్ బంద్ అయింది. ఆ పరికరాల్లో బయోమెట్రిక్ డివైజ్ బ్లాక్ చేసినట్టు, ఇంటర్నెట్ రావడం లేదని చూపించేది.

 టీఎస్​టీఎస్​ వాట్సప్ గ్రూపులో ఈ విషయాన్ని ప్రిన్సిపాళ్లు పెట్టినా​ సిబ్బంది  స్పందించలేదు. ఈ విషయాన్ని ఇంటర్మీడియెట్ కమిషనరేట్​లోని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా, స్పందన కరువైంది. ఇక చేసేదేమీ లేక పదిరోజులు చూసి.. ప్రిన్సిపాల్స్, సిబ్బంది కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో రెండు నెలలుగా కాలేజీల్లో బయోమెట్రిక్ బంద్ అయింది. 

నాలుగు కాలేజీల్లో అమలు

సర్కారు కాలేజీల్లో సుమారు 1.65 లక్షల మంది చదువుతున్నారు. వీరందరికీ ఫేషియల్ అటెండెన్స్ పెట్టాలని.. ఈ విద్యాసంవత్సరం పైలెట్ ప్రాజెక్టు కింద గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లోని నాలుగు కాలేజీల్లో ఇటీవల ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలో ఎంఏఎం గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో 1,500 మందికి, బజార్ ఘట్ గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో 600 మంది వరకు ఉన్నారు. కోర్సుల వారీగా విద్యార్థుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 

పూర్తయిన వాటికి ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. మరోపక్క గద్వాల జిల్లాలోని మల్దకల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, గద్వాల గవర్నమెంట్ కాలేజీల్లో అమలు చేస్తున్నారు. మల్దకల్​లో 205 మంది ఉండగా, గద్వాల కాలేజీలో 750 మంది వరకు ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లోని నాలుగు కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని కాలేజీల్లో ప్రారంభించేందుకు ఇంటర్మీడియెట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్​పై భిన్నాభిప్రాయాలు..

స్టూడెంట్లకు ఫేషియల్ అటెంటెన్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థులకు కేవలం పుస్తకాలు మాత్రమే ఉచితంగా అందిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో మాదిరిగా యూనిఫామ్, మిడ్డె మీల్స్, జావా, ఫ్రూట్స్/ ఎగ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, టెక్ట్స్ బుక్స్.. ఇలాంటి సౌకర్యాలేమీ లేవు. ఇవన్నీ పక్కదారి పట్టకుండా, ప్రభుత్వం పారదర్శకత కోసం ఆయా బడుల్లో ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. 

కానీ, కాలేజీల్లో సౌకర్యాలేమీ లేకుండా లెక్చరర్లకు ఉన్న బయోమెట్రిక్ తీసేసి,  కేవలం విద్యార్థులకు మాత్రమే ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడం ఏంటని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క సర్కారు కాలేజీల్లోకి వచ్చేది పేద విద్యార్థులేనని, వివిధ పనులు చేస్తుకుంటూ మధ్యలో ముఖ్యమైన సబ్జెక్టులు విని వెళ్లే విద్యార్థులూ కొందరుంటారని, వాళ్లకు ఈ విధానంతో ఇబ్బందులేనని లెక్చరర్లు అభిప్రాయపడుతున్నారు.