చనిపోయిన 12 గంటల తర్వాత మళ్ళీ బతికిన శిశువు.. అసలేం జరిగిందంటే.. ?

చనిపోయిన 12 గంటల తర్వాత మళ్ళీ బతికిన శిశువు.. అసలేం జరిగిందంటే.. ?

మహారాష్ట్రలో వింత ఘటన చోటు చేసుకుంది.. హాస్పిటల్లో చనిపోయిందని నిర్దారించిన 12  గంటల తర్వాత ఖననం చేసే ముందు మళ్ళీ బతికింది నవజాత శిశువు. మహారాష్ట్రలోని బీడ్ హాస్పిటల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బాలికా ఝుగే అనే మహిళ జులై 7వ తేదీ రాత్రి స్వామి రామానంద్ తీర్థ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన వెంటనే శిశువు మరణించినట్లు చెప్పారు వైద్యులు. ఆ తర్వాత 12 గంటలపాటు శిశువును ఆసుపత్రిలోనే ఉంచారు వైద్యులు.మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించిన తర్వాత శిశువును ఇంటికి తీసుకెళ్లారు బంధువులు. 

ALSO READ | కెనడాలో గాల్లోనే ఢీకొన్న విమానాలు.. కేరళకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

శిశువు అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా శిశువు ముఖాన్ని చివరిసారి చూసేందుకు కప్పి ఉన్న వస్త్రాన్ని తీసి చూడగా.. శిశువు కదులుతున్నట్లు గమనించారు. బిడ్డ బతికే ఉన్నట్లు గ్రహించిన బంధువులు సంతోషంతో ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత శిశువును అంబజోగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు బంధువులు.

ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తోంది శిశువు తల్లి. ఆసుపత్రిలో శిశువు మరణించినట్లు చెప్పినప్పుడే కదలికలు గమనించానని.. దీని గురించి నర్సుకు చెబితే తమ మాట లెక్కచేయలేదని ఆరోపించింది తల్లి. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని..ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది ఆసుపత్రి యాజమాన్యం.